విద్యార్థినీలను వేధించిన మెరైన్ కానిస్టేబుళ్లకు దేహశుద్ధి
ప్రకాశం(సింగరాయకొండ): రైల్లో ఇంజినీరింగ్ విద్యార్థినులను ఈవ్‌టీజింగ్ చేసిన ఇద్దరు మెరైన్ కానిస్టేబుళ్లకు ఆదివారం సింగరాయకొండలో స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు మెరైన్ కానిస్టేబుళ్లు నాగరాజు, షేక్ ఖాదర్‌హుస్సేన్ చీరాలలో ఎక్కారు. వీరు ఎక్కిన కంపార్టుమెంట్లో ఉన్న ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థినులను వేధించారు. ఒక విద్యార్థిని సింగరాయకొండ స్టేషన్లో దిగగానే కానిస్టేబుళ్లు కూడా దిగారు.
దిగిన వెంటనే వారు ఆమెను నీపేరు ఏంటని అడగ్గా.. మా నాన్నగారు వస్తున్నారు ఆయన్నడగండి చెబుతారనడంతో వారు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. తరువాత కారులో వెళుతున్న ఆ విద్యార్థిని రైల్వేస్టేషన్ రోడ్డులోని టిఫిన్ సెంటర్లో ఉన్న కానిస్టేబుళ్లను తండ్రికి చూపించి తమను వేధించిన విషయం చెప్పింది. ఈ విషయమై అడగడానికి వెళ్లిన విద్యార్థిని తండ్రి రవిబాబుపై కానిస్టేబుళ్లు తిరగబడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు దేహశుద్ధి చేశారు. తాము మెరైన్ కానిస్టేబుళ్లమని చెప్పడంతో స్థానికులు వారిని విడిచిపెట్టారు. దీనిపై సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో చెప్పినా పోలీసులు స్పందించలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ మల్లికార్జునరావును అడగగా తమకు ఫిర్యాదేమీ అందలేదని చెప్పారు.