ఏం జరుగుతోంది?
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో స్వేచ్ఛగా సంచరించే విభిన్న జీవరాశులు విగతజీవులుగా విశాఖ తీరానికి చేరుతున్నాయి. మునుపెన్నడూ చూడని జలచరాలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. తీరం వెంట ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) సహకారంతో కాలుష్య నియంత్రణ మండలి సిద్ధమవుతోంది. 2019 నాటికి సమగ్ర నివేదిక ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. గత రెండు నెలలుగా లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్లతోపాటు అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్ రే (టేకు చేప), ముళ్ల చేప తదితరాలు మరణించి తీరానికి కొట్టుకొస్తున్నాయి. అసలు సాగర గర్భంలో ఏం జరుగుతోంది? అరుదైన జీవరాశులు ఇలా విగత జీవులు ఎందుకవుతున్నాయి అనేది నిగ్గు తేల్చనున్నారు.
విశాఖ జిల్లావ్యాప్తంగా ఉన్న తీరం వెంట కాలుష్యాన్ని అధ్యయనం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఫార్మా, రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల నిర్వహణ సరిగా లేదనీ, వాటిని సముద్ర జలాల్లోకి విడుదల చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైడి భీమవరం నుంచి పాయకరావుపేట వరకూ సుమారు 200 కి.మీ. వరకూ ఉన్న తీరంలోని సముద్ర జలాల నమూనాలను సేకరించి, పరీక్షించి నివేదిక ఇవ్వాలని ఎన్ఐవోను కాలుష్య నియంత్రణ మండలి కోరింది. నైరుతి రుతుపవనాలకు ముందు, ఆ తర్వాత తీరంలోనూ, సముద్ర గర్భంలోనూ జరిగే పరిణామాలపై విశ్లేషణాత్మక అధ్యయనం జరగనుంది. దీనికోసం ఎన్ఐవోకు రూ.2 కోట్లు చెల్లించేందుకు మండలి అంగీకరించింది. 2009లోనూ ఎన్ఐవో ఈ తరహా అధ్యయనం నిర్వహించి నివేదికను 2010లో అందించింది. సముద్రంలో కాలుష్యం అంతగా లేదని నివేదికలో పేర్కొనడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, తాజా అధ్యయనంలో భాగంగా పారిశ్రామిక వ్యర్థాలు వదిలే 11 చోట్ల నమూనాలు సేకరించడంతోపాటు మరికొన్ని కీలక అనుమానిత ప్రాంతాల్లోనూ సముద్రంలోని నీటి నమూనాలు తీసుకుంటారు. దీంతోపాటు తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడి నీటి శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని ప్రయోగశాలలో పరిశీలించి విశ్లేషణాత్మక నివేదికను రూపొందించి 2019లో ఎన్ఐవో నివేదిక సమర్పించనుంది. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర సముద్ర కాలుష్యం పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది? వంటి అంశాలను నివేదికలో పొందుపరచనుంది.
ఎన్ఐవోతో సముద్ర జలాల కాలుష్యంపై అధ్యయనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. విశాఖలో తీరం వెంట ఉన్న ప్రతి అనుమానిత ప్రాంతంలోనూ నమూనాలు సేకరించి వాటి స్థితిగతులు, కాలుష్యం మోతాదు వంటి అంశాలపై నిశిత పరిశీలన చేసి అధ్యయనం చేయాలని ఎన్ఐవో అధికారులకి సూచించాం. ఏడాదిలోపు నివేదిక అందించనున్నారు.
– ఎన్వీ భాస్కరరావు, ఏపీపీసీబీ సంయుక్త ప్రధాన పర్యావరణ ఇంజనీర్, విశాఖపట్నం