సంక్షిప్తం..
ఐపీఓకు జీవీఆర్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: జీవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సంబంధించిన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి మంగళవారం సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని జీవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యోచిస్తోంది. ఈ ఐపీఓలో తాజా షేర్లతో పాటు ఐడీఎఫ్సీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 43.22 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేయనున్నారు. మూల ధన అవసరాలు. రుణ భారం తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ వ్యాపార అవసరాల కోసం ఈ ఐపీఓ నిధులను వినియోగించుకుంటామని కంపెనీ చెబుతోంది.
ఇన్ఫీబీమ్ ఐపీఓకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ ఇన్కార్పొరేషన్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఇన్ఫీబీమ్ రూ.450 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓ మార్గంలో నిధులు సమీకరించనున్న తొలి ఈ కామర్స్ కంపెనీ ఇదే కానున్నది.
ఐగేట్ సీఈవో పదవికి అశోక్ వేమూరి రాజీనామా
న్యూఢిల్లీ: ఐగేట్ కంపెనీ సీఈవో పదవి నుంచి అశోక్ వేమూరి వైదొలిగారు. భారత్‌లో అధిక ఉనికిని కలిగిన అమెరికాకు చెందిన ఐగేట్ కంపెనీని 4 బిలియన్ డాలర్లకు ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని ఈ ఏడాది జూలై 1న కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అశోక్ వేమూరి గతంలో ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. తర్వాత ఆయన 2013, సెప్టెంబర్‌లో ఐగేట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఐగేట్, క్యాప్‌జెమిని విలీన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు.
భారీ లాభాలతో హెచ్డీఎఫ్సీ ఎన్సీడీలు, వారంట్ల లిస్టింగ్
ముంబై: హెచ్డీఎఫ్సీ సంస్థ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్సీడీ)ల ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించగా, వారంట్ల ద్వారా రూ.5,400 కోట్లు రానున్నాయి. ఈ వారంట్లు, ఎన్సీడీలు భారీ ప్రీమియంతో లిస్టయ్యాయని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ చెప్పారు. రూ. 1 కోటి ముఖ విలువ ఉన్న 5,000 ఎన్సీడీలను 1.43 శాతం కూపన్ రేటుకు ఆఫర్ చేశామని, మంగళవారం 8.54 శాతం వద్ద ట్రేడవుతోందని పేర్కొన్నారు.