వరికి వర్షం దెబ్బ
ఒంగోలు టూటౌన్, టూటౌన్ :అకాల వర్షం అన్నదాతను కలవర పరుస్తోంది. ఊహించని విధంగా బుధవారం ఉరుములు.. మెరుపులతో కూడిన చిన్నపాటి వర్షం కురవడం ప్రారంభించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కోసిన వరి ఓదెలన్నీ చేలోనే ఉన్నాయి. ఇంటి వద్ద వసతి, గ్రామంలో మార్కెట్ సౌకర్యం లేక పొలాల్లోనే ఎంతో మంది ధాన్యం నిల్వ ఉంచుకున్నారు.
జిల్లాలో ఈ సీజన్లో 86 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఆరుగాలం కష్టపడి పండించిన వందల ఎకరాల పంట నూర్పిళ్లకు సిద్ధంగా ఉంది. కొత్తపట్నం మండలంలో మోటుమాల, పాదర్తి, అల్లూరు, ఈతముక్కల, మడనూరు ప్రాంతాల్లో కొన్ని కోసిన చేలు ఉండగా మరికొన్ని కోతకు సిద్ధంగా ఉన్నాయి. అసలు పంట చేతికందుతుందో లేదోనన్న బెంగ రైతన్నను కుంగదీస్తోంది.
ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు 40 బస్తాలు కూడా పండని పరిస్థితితో దిగాలు చెందుతుంటే అకాల వర్షం అసలుకే ముంచేటట్లు ఉందని వాపోతున్నారు. వరి రైతులతో పాటు పొగాకు రైతును అకాల వర్షం ఇబ్బంది పెట్టేటట్లు ఉంది. పందిళ్లపై ఆకు తడిస్తే రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. చిరుజల్లులు కాస్తా భారీ వర్షంగా మారితే రైతన్నకు కోలుకోలేని దెబ్బ తగలనుంది.