Market fees
-
సీఎం ప్రకటనతో ఆనందంలో అన్నదాతలు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి రైతులకు అండగా ఉంటామని అనేక పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా రైతుల నుంచి ట్రేడర్స్ వసూలు చేస్తున్న మార్కెట్ ఫీజు చెల్లించనవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి దాకా రైతుల పండించి తీసుకొచ్చిన వివిధ రకాల పండ్లను, కూరగాయలను కొందరు 4 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఇక నుంచి కమీషన్ పద్ధతి ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. దీంతో రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు తమకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో ప్రధాన పంట వరి సాగు. ఆ తరువాత వివిధ రకాల పంటలు ఉన్నాయి. వీటికిగాను పండ్లు, కూరగాయల విక్రయాలపై మార్కెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కాకర, దొండ, బీర, వంగ తదతర కూరగాయల సాగు 17 వేల ఎకరాల్లో, నిమ్మ 42 వేలు, మామిడి 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు కలసి మొత్తం 84 వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. ఏటా 65 లక్షల క్వింటాల్ కూరగాయలు, పండ్లు క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. వీటికి ఏటా మార్కెట్లోని ట్రేడర్స్, కొనుగోలుదారులు మార్కెట్ ఫీజు కింద సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏడాదికి రూ.కోటి వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ సెస్‌ను జిల్లాలోని 11 మార్కెట్ కమిటీలు ఉంటే ఆయా కమీటీలకు చెల్లిస్తారు. అయితే ట్రేడర్స్, కొనుగోలుదారులు చెల్లించే సెస్‌ను రైతుల వద్ద వసూలు చేస్తూ రైతులపై భారం మోపుతున్నారు. ట్రేడర్స్ చెల్లించాల్సిన దానికి కూడా రైతులపై భారం మోపడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ విషయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రైతులపై భారం పడకుండా ఉండే విధంగా సెస్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్పష్టమైన ఆదేశాలు జారీ లైసెన్స్‌లు కలిగిన ట్రేడర్స్‌కు కూడా మార్కెట్ఫీజు కట్టనవసరం లేదని తెలిపారు. కొనుగోలు దారులు, ట్రేడర్స్ వారి లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ నామ్ ప్లాట్ఫారం ద్వారా వలంటరీగా చేయాలనుకునేవారు కూడా లైసెన్స్‌లు పొందాలని పేర్కొన్నారు. కమీషన్ ఏజెంట్లు వ్యాపారం చేయాలనుకుంటే ట్రేడర్స్‌గా మారి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రైతుల వద్ద నుంచి కమీషన్ తీసుకునే పద్ధతి పూర్తిగా తొలగనుంది. ఈ నిర్ణయం రైతులు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫీజు వసూలు చేయడం లేదు జిల్లాలోని 11 మార్కెట్ కమిటీ శాఖలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పండ్లు, కూరగాయలకు, వీటిలో నిమ్మ కూడా వస్తుంది, వీటికి ఎటువంటి మార్కెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మార్కెట్కమిటీలకు ఆదేశాలు కూడా జారీ చేశాం. ప్రభుత్వం చెప్పిన ప్రకారం అమలు చేస్తాం. – రావమ్మ, ఏడీఎం, మార్కెట్ శాఖ -
జోరుగా జీరో..
కర్నూలు(అగ్రికల్చర్) : వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఆదాయం పడిపోతోంది. జీరో వ్యాపారం పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడంతో ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. నవంబరు నెలలో జరిగిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలను గతేడాదితో పోల్చి చూస్తే ఈసారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా, ఇందులో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్లలో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన మార్కెట్లలో క్రయ విక్రయాలు జరగకపోయినప్పటికీ బయట జరిగే లావాదేవీల నుండి ఒక్క శాతం మార్కెట్ ఫీజు వసూలు చేయాల్సి ఉంది. గతేడాది నవంబరుతో పోల్చి చూస్తే ఈ నవంబర్ నెలలో 8 మార్కెట్లు వెనుకబడిపోయాయి. పంట దిగుబడులు తగ్గడం ఇందుకు కారణమని అధికారులు చెబుతున్న జీరో వ్యాపారం పెరగడం వల్లనే తగ్గినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మార్కెటింగ్ శాఖకు 12 మార్కెట్ కమిటీల ద్వారా 35.90 కోట్లు ఫీజు రూపంలో వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చింది. ఇందులో నవంబర్ నెలకు రూ.3.38 కోట్లు ఒక్క శాతం ఫీజు ద్వారా వసూలు చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్ నెలలో రూ.3.55 కోట్లు వసూలు చేయగా, ఈ సారి మాత్రం రూ.3.26 కోట్లకు మార్కెటింగ్ శాఖ ఆదాయం పడిపోయింది. అంటే రూ.28.66 లక్షల ఆదాయం పడిపోయింది. మార్కెటింగ్ శాఖ అధికారులు మార్కెట్ కమిటీలు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల జీరో వ్యాపారం పెరిగింది. ప్రతి మార్కెట్ పరిధిలో చెక్‌పోస్టులు ఉన్నా అవినీతికి మారుపేరుగా మారిపోయాయి. జీరోపై వెళుతున్న వ్యవసాయ ఉత్పత్తులను చెక్‌పోస్టుల్లో పట్టుకుని ఫీజు వసూలు చేయాల్సి ఉన్నా అందులో పనిచేసే సిబ్బంది మామూళ్లు పుచ్చుకొని వదిలేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇటు మార్కెట్లలోనే జీరో వ్యాపారం జరుగుతుండగా, బయట మిల్లుల నుండి కూడా వ్యవసాయ ఉత్పత్తులు జీరోపై వెళుతున్నాయి. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆదోనిల్లో జీరో వ్యాపారం విస్తరించింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి గతేడాది నవంబర్‌లో రూ.62.50 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.30.59 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే 50 శాతం పైగా ఆదాయం తగ్గడానికి జీరో వ్యాపారమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల మార్కెట్ కమిటీ గతేడాది నవంబర్‌తో చూస్తే ఈ సారి రూ.4.77 లక్షలు, ఎమ్మిగనూరులో రూ.9.49 లక్షలు, డోన్‌లో రూ.2.13 లక్షలు, నందికొట్కూరు రూ.1.31, ఆత్మకూరులో రూ.5.59, బనగానపల్లిలో రూ.0.62, కోవెలకుంట్ల రూ.0.46 లక్షల ఆదాయం తగ్గింది. జీరో వ్యాపారం వల్ల ఆదాయం తగ్గిన చర్యలు మాత్రం లేవు. అయితే మార్కెట్ కమిటీల సిబ్బంది మాత్రం మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీరో వ్యాపారంపై మార్కెటింగ్ శాఖ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అదికార యంత్రాంగం చర్యలు తీసుకుని జీరో వ్యాపారాన్ని అరికట్టి మార్కెటింగ్ శాఖ ఆదాయం పెంపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఆదాయం పెరిగింది
తాండూరు: ఐదు జిల్లాల మార్కెట్ కమిటీల్లో గత ఏడాది కంటే ఈసారి మార్కెట్ ఫీజు ఆదాయం పెరిగిందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం వెల్లడించారు. సోమవారం ఆయన తాండూరు మార్కెట్ కమిటీని సందర్శించారు. మార్కెట్ కమిటీలో పప్పుధాన్యాల కొనుగోళ్లు, మార్కెట్ఫీజు తదితర రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరానికి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని 63 మార్కెట్ కమిటీల మార్కెట్ ఫీజు లక్ష్యం రూ.113 కోట్లని వివరించారు. ఇందులో ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.42.67 కోట్ల మార్కెట్ ఫీజు వసూలైందన్నారు. 2013 ఆగస్టులో ఆయా మార్కెట్ల నుంచి రూ.37.49కోట్ల మార్కెట్ ఫీజు వసూలైనట్టు చెప్పారు. ఈ లెక్కన ఈసారి రూ.5.17 కోట్లు అదనంగా మార్కెట్ ఫీజు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌తోపాటు పౌరసరఫరాల శాఖ ఐకేపీల ద్వారా మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లపై మార్కెట్ ఫీజు చెల్లించినందునే ఈసారి అదనంగా ఫీజు వసూలైందన్నారు. అంతకుముందు డీడీ మార్కెట్ కమిటీ మూడో శ్రేణి కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సూపర్వైజర్ హబీబ్ అల్వీతో సమావేశమై ఆహార ఉత్పత్తుల రాక, మార్కెట్ ఫీజు వసూలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ-బిడ్డిండ్ ద్వారా కొనుగోళ్లు మార్కెట్ యార్డుల్లో ఆహార ఉత్పత్తుల క్రయవిక్రయాలు, పంట ధరల నిర్ణయాలు తదితర కార్యకలాపాలన్నీ ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మల్లేశం పేర్కొన్నారు. మార్కెట్లో ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. యార్డుల్లో ప్రస్తు తం పంట ఉత్పత్తులకు కమీషన్ ఏజెం ట్లు బహిరంగ వేలం పాట ద్వారా ధర నిర్ణయిస్తున్నారన్నారు. ఇకపై యార్డులను కంప్యూటరీకరిస్తామని, ఈ-బిడ్డింగ్ ద్వారా నే పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. ప్రాథమికంగా ఈ-బిడ్డింగ్ కోసం నిజామాబాద్, వరంగల్, మిర్యాలగూడ, కే.సముంద్రం మార్కెట్ యార్డులను ఎంపిక చేశామన్నారు. కమీషన్ ఏజెంట్లు తాము కొనుగోలు చేయాలనుకున్న పంట ఉత్పత్తులకు ఎంత ధర చెల్లించాలనుకుంటున్నారో కోడ్ల ఆధారంగా ఈ-బిడ్డిండ్ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రైతులు పంట ను యార్డులోపలికి తీసుకువచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదవుతాయన్నారు. పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం.. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత ఏడాది కంటే ఈసారి సుమా రు 41వేల హెక్టార్లలో పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని మల్లేశం అన్నారు. పత్తి కొనుగోలుకు కొత్తగా తాండూరు, మర్పల్లి, ఇబ్రహీంపట్నం, సదాశివపేట, వట్పల్లి, గద్వాల్, అచ్చంపేట, కల్వకుర్తిలలో పత్తి (సీసీఐ)కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అక్టోబర్ నాటికి ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. గతంలో మాదిరిగా చెక్‌ల రూపంలో కాకుండా పత్తి రైతులకు ఈసారి డబ్బులను ఆన్లైన్లో చెల్లించాలని ప్రభుత్వం సీసీఐకి ఆదేశాలిచ్చిందని తెలిపారు. 48గంటల్లోనే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. మీసేవ, వీఆర్ఓ నుంచి భూమి వివరాల ధ్రువీకరణ పత్రాల, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతిని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. బస్తాల్లో కూడా ఈసారి పత్తిని లూజ్‌గా తెచ్చినా కొనుగోలు చేస్తారని ఆయన చెప్పారు.