కర్నూలు(అగ్రికల్చర్) : వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఆదాయం పడిపోతోంది. జీరో వ్యాపారం పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడంతో ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. నవంబరు నెలలో జరిగిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలను గతేడాదితో పోల్చి చూస్తే ఈసారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా, ఇందులో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్‌లలో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.
మిగిలిన మార్కెట్లలో క్రయ విక్రయాలు జరగకపోయినప్పటికీ బయట జరిగే లావాదేవీల నుండి ఒక్క శాతం మార్కెట్ ఫీజు వసూలు చేయాల్సి ఉంది. గతేడాది నవంబరుతో పోల్చి చూస్తే ఈ నవంబర్ నెలలో 8 మార్కెట్లు వెనుకబడిపోయాయి. పంట దిగుబడులు తగ్గడం ఇందుకు కారణమని అధికారులు చెబుతున్న జీరో వ్యాపారం పెరగడం వల్లనే తగ్గినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మార్కెటింగ్ శాఖకు 12 మార్కెట్ కమిటీల ద్వారా 35.90 కోట్లు ఫీజు రూపంలో వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చింది. ఇందులో నవంబర్ నెలకు రూ.3.38 కోట్లు ఒక్క శాతం ఫీజు ద్వారా వసూలు చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్ నెలలో రూ.3.55 కోట్లు వసూలు చేయగా, ఈ సారి మాత్రం రూ.3.26 కోట్లకు మార్కెటింగ్ శాఖ ఆదాయం పడిపోయింది. అంటే రూ.28.66 లక్షల ఆదాయం పడిపోయింది. మార్కెటింగ్ శాఖ అధికారులు మార్కెట్ కమిటీలు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల జీరో వ్యాపారం పెరిగింది. ప్రతి మార్కెట్ పరిధిలో చెక్‌పోస్టులు ఉన్నా అవినీతికి మారుపేరుగా మారిపోయాయి. జీరోపై వెళుతున్న వ్యవసాయ ఉత్పత్తులను చెక్‌పోస్టుల్లో పట్టుకుని ఫీజు వసూలు చేయాల్సి ఉన్నా అందులో పనిచేసే సిబ్బంది మామూళ్లు పుచ్చుకొని వదిలేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇటు మార్కెట్లలోనే జీరో వ్యాపారం జరుగుతుండగా, బయట మిల్లుల నుండి కూడా వ్యవసాయ ఉత్పత్తులు జీరోపై వెళుతున్నాయి.
కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆదోనిల్లో జీరో వ్యాపారం విస్తరించింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి గతేడాది నవంబర్‌లో రూ.62.50 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.30.59 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే 50 శాతం పైగా ఆదాయం తగ్గడానికి జీరో వ్యాపారమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల మార్కెట్ కమిటీ గతేడాది నవంబర్‌తో చూస్తే ఈ సారి రూ.4.77 లక్షలు, ఎమ్మిగనూరులో రూ.9.49 లక్షలు, డోన్‌లో రూ.2.13 లక్షలు, నందికొట్కూరు రూ.1.31, ఆత్మకూరులో రూ.5.59, బనగానపల్లిలో రూ.0.62, కోవెలకుంట్ల రూ.0.46 లక్షల ఆదాయం తగ్గింది.
జీరో వ్యాపారం వల్ల ఆదాయం తగ్గిన చర్యలు మాత్రం లేవు. అయితే మార్కెట్ కమిటీల సిబ్బంది మాత్రం మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీరో వ్యాపారంపై మార్కెటింగ్ శాఖ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అదికార యంత్రాంగం చర్యలు తీసుకుని జీరో వ్యాపారాన్ని అరికట్టి మార్కెటింగ్ శాఖ ఆదాయం పెంపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
జోరుగా జీరో..
Published Fri, Dec 19 2014 2:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement