సిగరెట్ల రేట్లు ఇక డబుల్!
ప్రపంచంలోకెల్లా ఆస్ట్రేలియాలో సిగరెట్ల ధరలు మండిపోనున్నాయి. ఇప్పటికే అధికధరలున్న ఆస్ట్రేలియాలో మరో నాలుగేళ్లలో 25 సిగరెట్ల ప్యాకెట్ ధర 2,300 రూపాయలకు చేరుకోనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పొగాకుపై ఎక్సైజ్ సుంకాన్ని ఈ ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లపాటు, అంటే 2020 వరకు ఏడాదికి 12.5 శాతం పెంచాలని ప్రభుత్వం బడ్జెట్లో నిర్ణయించడమే ఇందుకు కారణమని ఆ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఓ సర్వే ప్రకారం ఇప్పటికే మెల్బోర్న్లో మార్ల్బోరో సిగరెట్ ప్యాకెట్‌ను దాదాపు 1270 రూపాయలకు విక్రయిస్తుండగా, సిడ్నీలో 1165 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ సిగరెట్ ప్యాకెట్లను పారిస్‌లో 524 రూపాయలకు, అట్టావాలో 599 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే, ఆ నగరాలకన్నా రెట్టింపు ధరలకు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇవే సిగరెట్ ప్యాకెట్లను లండన్‌లో 920, న్యూయార్క్‌లో 895 రూపాయలకు విక్రయిస్తున్నారు. పొగాకుపై ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఎక్సైజ్ పన్నును విధించిన దేశం ఆస్ట్రేలియానేనని ఇంపీరియల్ అమెరికా టొబాకో కార్పొరేట్, లీగల్ వ్యవహారాల అధిపతి ఆండ్రీవ్ గ్రెగ్సన్ తెలిపారు.