పెళ్లి చేసేస్తాం: ప్రేమపక్షులకు వార్నింగ్
వేలంటైన్స్ డే వచ్చిందంటే చాలు... రోడ్లు, పార్కులు, చెరువు గట్లు ఇలా అన్నిచోట్లా ఒకటే హడావుడి. అయితే, ప్రేమపక్షులను బెదిరించేందుకు మరో వర్గం కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. తాజాగా ఒడిషాలో వేలెంటైన్స్ డే సందర్భంగా బజరంగ్ దళ్ ప్రేమికులను హెచ్చరించింది. ప్రతిసంవత్సరంలాగే ఈసారి కూడా ప్రేమికుల రోజునాడు తాము గమనిస్తూ ఉంటామని, యువతీ యువకులు కలిసి కనిపిస్తే వాళ్లకు పెళ్లి చేసేస్తామని హెచ్చరించారు. వేలెంటైన్స్ డే అనేది భారతీయ సంస్కృతి కాదని, అందువల్ల పెళ్లి కాకుండానే యువతీ యువకులు కలిసి తిరగడం సరికాదని బజరంగ్ దళ్ వాదిస్తోంది.
గతంలో కూడా బహిరంగ స్థలాల్లో కలిసి తిరుగుతున్న చాలామంది యువతీ యువకులను బజరంగ్ దళ్ కార్యకర్తలు వేలెంటైన్స్ డే రోజున పట్టుకుని వారికి దాదాపు పెళ్లిళ్లు చేసినంత పని చేశారు. అలాగే దీనికి సంబంధించిన బహుమతులు, ఇతర వస్తువులను అమ్మే దుకాణాల మీద దాడులు చేశారు. యువ ప్రేమికులు పార్కులు, మాల్స్, ఇతర బహిరంగ స్థలాల్లో కనిపిస్తే తాము కచ్చితంగా వాళ్లకు పెళ్లి చేస్తామని భువనేశ్వర్ బజరంగ్ దళ్ సమన్వయకర్త భూపేష్ కుమార్ నాయక్ హెచ్చరించారు. ప్రేమ పేరుతో యువతీ యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకమని నాయక్ అన్నారు. కేవలం పెళ్లి చేయడమే కాక.. ఇద్దరి తల్లిదండ్రులను కూడా పిలిచి వాళ్ల ముందు చేస్తామన్నారు. ఇంతకుముందు ఇలాగే తాళి కట్టిస్తే, కాసేపటి తర్వాత ఆ తాళిని కూడా తీసి పారేసిన సందర్భాలు ఉండటంతో ఇలా చేస్తున్నారు.