కులాంతర వివాహాలకు ప్రోత్సాహం
‘అంబేడ్కర్’ పథకం కింద ఒక్కో జంటకు రూ.2.5 లక్షల సహాయం
హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులకు ఆర్థిక సహాయమందించి వారు నిలదొక్కుకునేందుకు డా.అంబేడ్కర్ స్కీం ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ (డా.అంబేడ్కర్ కులాంతర వివాహాల ద్వారా సామాజిక సమైక్యత పథకం) ద్వారా కేంద్రం సహాయం అందించనుంది. డా.అంబేడ్కర్ ఫౌండేషన్ ద్వారా కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ ఈ పథకం గురించి ఓ ప్రకటనలో వివరించింది. దేశవ్యాప్తంగా ఏడాదికి 500 జంటలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 34 జంటలకు సహాయం అందుతుంది. ఈ పథకం కింద రూ.2.5 లక్షలు అందజేస్తారు.
ఇందులో 50 శాతం డబ్బులు డీడీ రూపంలో, మిగిలిన డబ్బును ఐదేళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఈ పథకాన్ని 2013-14, 2014-15లో ప్రారంభించారు. దంపతుల్లో ఒకరు షెడ్యూల్ తరగతికి చెందిన వారై, మరొకరు ఇతర కులాల వారై ఉండి, చట్టపరంగా వివాహం చేసుకున్న వారు అర్హులు. దంపతుల ఆదాయం ఏడాదికి రూ.5 లక్షలకు మించకూడదు. అలాగే నవదంపతుల తరపున ఎంపీ కాని, ఎమ్మెల్యే కాని, జిల్లా కలెక్టర్ కాని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. అంబేడ్కర్ ఫౌండేషన్ వెబ్సైట్ www.ambedkarfoundation.nic.in ద్వారా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది.