నాకిప్పుడు 28 ఏళ్లు.. పెళ్లంటే భయం!
సందేహం
నాకిప్పుడు 28 ఏళ్లు. మా ఇంట్లో నాకు మూడు నాలుగేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు పెళ్లంటే ఆసక్తి లేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా... ఏదో ఒక వంక పెట్టి చెడగొడుతున్నాను. అసలు కారణం ఏమిటంటే.. నాకు సెక్స్ అంటే చాలా భయం. స్కూల్ ఏజ్ నుంచే నాకు పెళ్లి అన్నా, సెక్స్ అన్నా భయం ఏర్పడింది. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను. నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది లేరు. మా అమ్మానాన్నలు మొదట ఊరుకున్నా.. ఈ మధ్య బాగా తిడుతున్నారు. ఎలాగైనా పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. నా బాధ అర్థం చేసుకొని, పరిష్కారం చెప్పండి ప్లీజ్.
- ఓ సోదరి
కొందరు ఆడవారిలో వారి చిన్నతనంలో ఇంట్లో లేదా బయట పెళ్లి, సెక్స్ గురించి కొన్ని సంఘటనలు చూడడం వల్ల, లేకపోతే స్నేహితులు మాట్లాడుకోవడం విని భయపడటం వల్ల, ఇంకా కొన్ని కారణాల వల్ల.. పెళ్లి, సెక్స్ మీద చెడు అభిప్రాయం పెంచుకొని భయపడుతుంటారు. దానివల్ల వయసు పెరిగినా భయం పోకుండా పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. మీ విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది. మీరు లోపల భయపడుతూ నాలుగేళ్ల నుంచి పెళ్లి సంబంధాలను నిరాకరిస్తూ ఉంటే.. మీ పెద్దవాళ్లు మాత్రం ఎంత కాలం అని ఓపిక పడతారు.
ఒకపక్క మీ వయసు పెరుగుతుంటే వాళ్లు మరింత కంగారు పడుతుంటారు. అందరూ మీలాగే పెళ్లికి భయపడి వాయిదా వేస్తూ ఉంటే.. లోకంలో ఎంతమందికి పెళ్లిళ్లు అవుతాయి? మీరు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్లే ఇలా జరుగుతోంది. కాబట్టి మీరు ఆ భయం నుంచి బయటపడి, పెళ్లి గురించి, దాని తర్వాత జీవితం గురించి ఆలోచించండి. మీ పెద్దల మాట విని సంతోషంగా పెళ్లి చేసుకోండి. ఒకవేళ ఇంకా అలాగే ఉంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోండి.
నా వయసు 27. నాకు పెళ్లై రెండేళ్లయింది. నాకిప్పుడు నాలుగు నెలల బాబు ఉన్నాడు. వేసవిలో విరివిరిగా దొరికే మల్లెపూలంటే నాకు చచ్చేంత ఇష్టం. కానీ ఇప్పుడు బాలింతనని, బాబుకు పాలు పడుతున్నానని మల్లెపూలు పెట్టుకోనివ్వడం లేదు మా ఇంట్లో వాళ్లు. పాలు ఇవ్వడానికి, మల్లెపూలకు సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చండి.
- రాజేశ్వరి, మీర్పేట్
మల్లెపూల వాసనతో లేదా మల్లెపూలు రొమ్ము మీద ఎక్కువసేపు ఉండడం వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ తరచూ మల్లెపూలు పెట్టుకోవడం, వాటి వాసనను ఎక్కువగా పీల్చడం వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ (ఇది పాల ఉత్పత్తిని పెంచే హార్మోన్) తగ్గి, దానివల్ల పాలు రావడం కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది.
సైంటిఫిక్ రీజన్ తెలియక పోయినా... పాలు తగ్గుతాయనే విషయం తెలిసే మీ పెద్దవాళ్లు మిమ్మల్ని మల్లెపూలు పెట్టుకోవద్దని చెప్పి ఉండొచ్చు. మరీ మీకు మల్లెపూలు పెట్టుకోవాలని అనిపిస్తే, ఎప్పుడైనా కొద్దిసేపు పెట్టుకొని తీసేయొచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు.
మా అమ్మకు ఇప్పుడు 44 ఏళ్లు. తనకు గత అయిదారేళ్లుగా పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు. పీరియడ్‌కి పీరియడ్‌కి మధ్య రెండు మూడు నెలల గ్యాప్ ఉంటోంది. ఒక్కోసారి 5-6 నెలల గ్యాప్ కూడా ఉంటోంది. రెండేళ్ల క్రితం ఒక డాక్టర్‌ను సంప్రదిస్తే.. ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వాటిని వాడిన తర్వాత కొన్ని నెలలు పీరియడ్స్ కరెక్ట్‌గా వచ్చాయి. తర్వాత ఎప్పటిలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అందరేమో, వయసు పెరుగుతుంది కదా. పీరియడ్స్ ఆగిపోయే ముందు అలాగే ఉంటుంది అంటున్నారు. మా అమ్మేమో ఆస్పత్రికి వెళ్దామంటే రావడం లేదు. ఆమె చాలా వీక్‌గా ఉంటుంది. దయచేసి అది నేచురల్‌గా జరుగుతోందా? లేక గర్భసంచికి సంబంధించిన సమస్య ఏమైనా ఉండటం వల్ల అలా అవుతుందా చెప్పండి.
- సాగరిక, ఊరు రాయలేదు
నలభై ఏళ్ల తర్వాత ఆడవారిలో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల పనితీరు తగ్గడం మొదలై, వాటి నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం మొదలవుతుంది. దానివల్ల పీరియడ్స్ క్రమం తప్పడం జరుగుతుంది. కొందరిలో వారి శరీరతత్వాన్ని బట్టి పీరియడ్స్ ఆలస్యంగా వస్తే, కొందరిలో పీరియడ్స్ త్వరగా ఎక్కువ బ్లీడింగ్‌తో రావడం ఉంటుంది. మీ అమ్మగారు బలహీనంగా ఉన్నారంటున్నారు కాబట్టి ఇంకా వేరే సమస్యలు.. అంటే రక్తహీనత, టీబీ, థైరాయిడ్ సమస్య లేదా అండాశయాలలో గడ్డలు వంటి ఎన్నో సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు.
కొందరిలో 40 ఏళ్ల తర్వాత గర్భాశయంలో, అండాశయాలలో సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా మీ అమ్మగారిని తప్పనిసరిగా ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి, అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించి సమస్యను బట్టి చికిత్స చేయించండి. ఎలాంటి సమస్యా లేకపోతే పీరియడ్స్ ఆగిపోయే ముందు వచ్చే మార్పుల వల్లే అయితే, నిశ్చింతగా ఉండి బలానికి విటమిన్, కాల్షియం మాత్రలు వేసుకుంటే సరిపోతుంది.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్