అత్తింట్లోనే వివాహిత సమాధి
- నట్టింట్లో గొయ్యి తీసి పాతిపెట్టిన బంధువులు
- పిల్లలకు న్యాయం చేయాలని ఆందోళన
కాశిబుగ్గ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వివాహితను ఆమె బంధువులే ఆమె అత్తగారి ఇంట్లోనే సమాధి చేసిన ఉదంతం సోమవారం వరంగల్ నగరంలోని ఏనుమాములలో జరిగింది. నట్టింట్లో గొయ్యి తీసి ఆమె మృతదేహాన్ని సమాధి చేసిన బంధువులు పిల్లలకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఏనుమాములకు చెందిన ఆమెర రాధిక ఆదివారం వేకువన అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే, భర్త విజయ్‌కుమార్‌తో పాటు అత్తింటి వారు వేధించి రాధికను హత్య చేశారని ఆమె తండ్రి యాకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం జరగగా, బంధువులు ఆమె మృతదేహాన్ని నేరుగా రాధిక అత్తగారింటికి తీసుకొచ్చారు. నట్టింట్లో గొయ్యి తీసి సమాధి చేశారు.
రాధ భర్త విజయ్‌కుమార్ పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మృతురాలి ముగ్గురు పిల్లలకు రాసి ఇవ్వాలని, కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలంటూ ఇంటి ముందు బైఠాయించారు. ఏసీపీ చైతన్య కుమార్ వచ్చి మృతురాలి బంధువులకు నచ్చజెప్పారు. ఆస్తి గురించి సంతకాలు తమ ముందే చేయించాలని పట్టుపట్టారు. స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచనను పిలిపించి.. మృతురాలి బంధువులు ఐదుగురు స్టేషన్‌కు వస్తే అందరి సమక్షంలో సంతకాలు చేయిస్తానని ఏసీపీ హామీ ఇచ్చారు. ఇంటి వద్ద ఎవరూ ఉండకూడదని, సంతకాల బాధ్యత తనదేనని ఏసీపీ చెప్పినా మృతురాలి బంధువులు ఇంటి వద్దనే ఉన్నారు. దీంతో పోలీసులు ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.