కళాకారులకూ ప్రత్యేక కోటా కల్పించండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రముఖ సాహితీవేత్త మరుళ సిద్దప్ప
సాక్షి, బెంగళూరు :విద్యా, ఉద్యోగ రంగాల్లో క్రీడాకారులకు ప్రత్యేక కోటా కల్పిస్తున్నట్లుగానే కళాకారులకూ ప్రత్యేక కోటా కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రముఖ సాహితీవేత్త కె.మరుళ సిద్దప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటక రాజ్య రంగ పదవీధరర వేదికె ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి సంసా బయలు రంగమందిరలో నిర్వహించిన రంగకార్మిగల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మరుళ సిద్ధప్ప మాట్లాడుతూ... ఇతర రంగాల్లోని కళాకారుల్లాగా నాటక రంగ కళాకారుల్లో ఐక్యత లేదని, అందువల్లే నాటక రంగ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాటక విభాగంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక నాటక రంగ కళాకారుడిని ఉపాధ్యాయుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. అంతేకాక నాటక రంగ కళాకారులను సంస్కృతికి వారధులుగా కళాశాలల్లో నియమించాలని కోరారు. ఇక ఈ సమావేశానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ గైర్హాజరు కావడంపై సమావేశంలోని పలువురు నాటక రంగ ప్రముఖులు అసహనాన్ని వ్యక్తం చేశారు.
నాటక రంగం నుంచి వచ్చి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉమాశ్రీ అదే నాటక రంగంలోని వ్యక్తుల బాధలు వినడానికి మాత్రం రాకపోవడం శోచనీయమని సమావేశానికి హాజరైన పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో సాహితీవేత్త డాక్టర్ విజయ, నాటక రంగ కళాకారులు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.