మురిపెంగా.. మొదటి మారుతి!
భారతదేశంలో వ్యక్తిగత రవాణా వాహనాల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చింది ‘మారుతి 800’. 1980లలో ఉన్నత, ఎగువ మధ్య తరగతి కుటుంబాలతో ఈ కారు భావోద్వేగపూరిత బంధాన్ని పెనవేసుకొంది. కొంతమందిలో ఆ బంధం ఇప్పటికీ తాజాగా ఉంది. హర్పాల్సింగ్, గుల్షాన్బీర్ కౌర్... దేశంలో అమ్ముడైన తొలి మారుతి 800 ఓనర్లు! మార్కెట్లో అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనడానికి లక్షల మంది పోటీ పడగా, లక్కీ డ్రాలో ఆ అదృష్టం వీరిని వరించింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా హర్పాల్ తొలి కారు తాళం చెవులు అందుకొన్నారు! అప్పటి ధర 47,000. 33 యేళ్లు గడిచిపోయాయి. హర్పాల్ తర్వాత ఎంతమంది ఆ కారును కొన్నా, ఆ క్రేజీ కారు తొలి ఓనర్‌గా ఈ సర్దార్జీ చరిత్రలో స్థానం సంపాదించుకొన్నారు. 2010లో హర్పాల్ సింగ్ మరణించారు.
రెండేళ్ల తర్వాత ఆయన భార్య కూడా కాలం చేశారు. ఇదే సమయంలో మారుతి కంపెనీ 800 కారుల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టుగా ప్రకటించింది. కాలుష్య నియంత్రణ విషయంలో అమల్లోకి వచ్చిన చట్టాల నేపథ్యంలో ఈ కారు ఉత్పత్తిని ఆపివేస్తున్నట్టుగా దాదాపు ఏడాది కిందట మారుతి ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. దీంతో చాలా మంది మారుతి 800 ఓనర్లు గందరగోళంలో పడ్డారు. తమ కార్లను వదిలించుకొన్నారు! అయితే హర్పాల్ సింగ్ కుటుంబం మాత్రం ఆ కారును వదులుకొనే ప్రసక్తే లేదంటోంది. తొలి అనుబంధం తమ దగ్గరే పదిలంగా ఉండాలని కోరుకుంటోంది.