గిరిజనుల భారీ ర్యాలీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ శ్రీకృష్ణ విద్యా మందిర్ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం వనవాసీ కళ్యాణాశ్రమ్ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర గిరిజన మహాసభ’ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు, మహిళలు ప్రేమసమాజం నుంచి శ్రీకృష్ణ విద్యా మందిర్ సమావేశ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ద్వారకానగర్ సభాస్థలికి చేరుకున్నారు.
సభకు శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, అఖిల భారత సంఘటన ప్రతినిధి పి.సోమయాజులు, వనవాసి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గణబాబు, డాక్టర్ ఎన్.ఎస్.రాజు, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు ఆర్.ఎస్.దొర , పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. బాలాసాహెబ్దేశ్పాండే శత జయంతిని పురస్కరించుకొని ‘వనవాణి’గిరిజన మాసపత్రిక ప్రత్యేక సంచికను పూజ్యస్వామిజీ ఆవిష్కరించారు.
అశోక్ బీకే స్టీల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి ముఖేష్ బస్సల్వనవాసీ కళ్యాణాశ్రమ్కు విరాళంగా ఇచ్చిన సంచార వైద్యశాలను స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. అనంతరం వనహేల వనవాస విద్యార్థులకు గతంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గణబాబు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వనవాసి సేవలు,ప్రముఖుల ఫొటోలు, స్వామి వివేకానంద సంచార పుస్తక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.