అంచనాల్లో కోత అన్నదాతకు వాత
దెబ్బతిన్న పంటల విస్తీర్ణం భారీగా కుదింపుప్రాథమిక అంచనాల ప్రకారం 5.42 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం నష్టపోయిన రైతులకు ఉదారంగా సాయం అందించాల్సిన ప్రభుత్వం.. నిబంధనల సాకుతో సాయంలో భారీగా కోత విధిస్తోంది. నష్టాన్ని తక్కువగా చూపి చేతులు దులుపుకునేందుకే మొగ్గు చూపుతోంది. కళ్లెదుట కనిపిస్తున్న నష్టానికి, ఆచరణలో ప్రభుత్వ లెక్కలకు పొంతనే కుదరడం లేదు. కనుచూపు మేరలో దిగుబడి వచ్చే అవకాశమే లేదని తెలుస్తున్నా, తప్పుడు అంచనాలతో రైతులను బురిడీ కొట్టించడానికే మొగ్గు చూపుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. పరిహారం పేరుతో ప్రభుత్వం తమను గుండెకోతకు గురి చేస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు తోడు కృష్ణ, గోదావరి, నాగవళి, వంశధార నదులకు పోటెత్తిన వరద అన్నదాతల ఆశలను చిదిమేసింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల బుడమేరు, ఏలేరు వాగుల ఉధృతి ఇటు ప్రజలను, అటు కొల్లేరు రైతులను నట్టేట ముంచింది. ఇటువంటి కష్ట కాలంలో ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. నిబంధనల సాకుతో అడ్డగోలుగా సాయంలో కోతలు విధించడంతో రైతులకు కడుపు కోత మిగులుతోంది. ప్రాథమికంగా 5.42 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 51 లక్షల ఎకరాల్లో ఉద్యాన, పట్టు పంటలు ముంపునకు గురవ్వగా, 3.08 లక్షల మంది రైతులకు రూ.403.93 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌సబ్సిడీ) చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. అత్యధికంగా 4.29 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురికాగా, 2.16 లక్షల మంది రైతులకు రూ.291.74 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా. వాస్తవానికి కనీవినీ ఎరుగని రీతిలో ఇంత కంటే ఎక్కువే పంట నష్టం జరిగిందన్నది సుస్పష్టం. ముంపు నీరు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రంగంలోకి దిగిన పంట నష్టం అంచనా బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు తుది అంచనాలు రూపొందించాయి. చివరకు 2.88 లక్షల ఎకరాల్లో మాత్రమే వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నాయని, ఆ మేరకు 1.86 లక్షల మంది రైతులకు రూ.278.49 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి వస్తుందని లెక్కతేల్చాయి. వరి రైతుకు గుండె కోత రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా 10–15 రోజుల పాటు వరి పంట ముంపు నీటిలో నాని ఎందుకూ పనికి రాకుండా పోయింది. అలాంటిది తుది అంచనాలకొచ్చేసరికి 2.22 లక్షల ఎకరాల్లోనే వరి పంటకు నష్టం వాటిల్లిందని లెక్క తేల్చడం విస్మయానికి గురిచేస్తోంది. 1.43 లక్షల మంది రైతులకు రూ.222.26 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా చెల్లించాలని లెక్క తేల్చారు. వరి రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడులు కోల్పోయారు. కొంత మేర ముంపు నీరు దిగినప్పటికీ ఎకరాకు ఆరేడు బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా సరే తుది అంచనాల్లో దెబ్బ తిన్న వరి పంట విస్తీర్ణాన్ని కుదించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత 58 వేల ఎకరాల్లో దెబ్బ తిన్న పత్తి పంట తుది అంచనాలకు వచ్చేసరికి 26 వేల ఎకరాలకు కోత పడింది. తొలుత 25 వేల ఎకరాల్లో మొక్క జొన్న దెబ్బ తిన్నట్టుగా గుర్తించగా, చివరికి జరిగిన నష్టం 17 వేల ఎకరాలకు పరిమితమైంది. అపరాలతో సహా ఇతర పంటలు తొలుత 30 వేల ఎకరాలు ముంపునకు గురికాగా, తుది అంచనాలకు వచ్చే సరికి 23 వేల ఎకరాలకు పరిమితమైంది. ఆ 8 జిల్లాల్లోనూ భారీగా కోత వరదలు, వర్షాల వల్ల ప్రాథమికంగా 19 జిల్లాల్లో 18 రకాల వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నట్టుగా అంచనా వేశారు. అత్యధికంగా కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, కాకినాడ, నంద్యాల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 4.97 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఈ జిల్లాల్లో ఇంతకంటే ఎక్కువగానే నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. కానీ తుది అంచనాల కొచ్చేసరికి పంటల సంఖ్య 23కు పెరిగింది. కానీ దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 2.64 లక్షల ఎకరాలకు పరిమితమవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణ, బుడమేరు వరదల ప్రభావంతో కృష్ణ, ఎనీ్టఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. అలాంటిది ఆయా జిల్లాల్లో కూడా తుది అంచనాల్లో భారీగా కోత పెట్టడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.10వేలు ఇస్తామని.. వరి, పత్తి, వేరుశనగ, చెరకు (మొదటి పంట) పంటలకు ఎకరాకు రూ.10 వేలు, మొక్కజొన్న, సజ్జలు, మినుములు, పెసలు, కందులు, రాగులు, కొర్రలు, సామలు, రాగులు, నువ్వులు, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆముదం, జూట్ పంటలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి అడ్డగోలుగా కోత పెడుతూ అరకొర సాయం ఇస్తామనడం మోసం చేయడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.