మస్తాన్‌బాబు ఆశయాలను సాధిస్తా : భద్రయ్య
రంపచోడవరం : ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలను అధిరోహించి మల్లి మస్తాన్‌బాబు ఆశయాలను నెరవేరుస్తానని ప్రపంచంలోని ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిజన యువకుడు దూబి భద్రయ్య అన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మంగళవారం రంపచోడవరం వచ్చిన భద్రయ్యను ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధర్‌బాబు అభినందించారు. పీఎంఆర్సీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రయ్యకు సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ కృషి, పట్టుదల ఐటీడీఏ ఇచ్చిన సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించానన్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చారని, ఐటీడీఏ తరఫున ఉపాధి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్కలెక్ట్ రవిపటాన్శెట్టి, ఈఈ పీకే నాగేశ్వరావు, సీహెచ్ఓ డి.శ్రీనివాస్, ఏపీడీ శంకర్ నాయక్, డీఈలు శ్రీనివాస్, హరికృష్ణ, ఏఎంఓ డీఎస్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పదిరోజుల ప్రయాణం...
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరిగి రావడానికి పది రోజుల సమయం పట్టిందని భద్రయ్యఅన్నారు.నార్త్కోల్ నుంచి ఏబీసీ-1,2,3లు దాటుకొని 8848 మీటర్ల ప్రయాణించి ఎవరెస్టును ఎక్కడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఎవరెస్టు శిఖరం అధిరోహణలో ఎక్కడా భయపడలేదని తెలిపారు. మైనస్ జీరో డిగ్రీల వద్ద తన శరీరం సహకరిస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే తన ప్రయాణం సాగిందన్నారు.
ఆరుగురు సభ్యుల బృందంలో 8500 మీటర్లు పైకి ఎక్కిన తరువాత ఒకరు వెనుదిరిగారని తెలిపారు. మంచుకొండల్లో రాత్రిపూట నడక ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిందన్నారు. ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి ఏడురోజులు, తిరిగిరావడానికి మూడు రోజుల సమయం పట్టిందన్నారు. ఎవరెస్టు ఎక్కడానికి సహరించిన ఐటీడీఏ పీఓ, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ తనకు శాశ్వత ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. పోలీస్ శాఖలో చేరాలన్న తన కోరిక నెరవేరకపోవడంతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించానన్నరు. గిరిజనుడిగా కొండల్లో సాగిన తన జీవనం ఎవరెస్టును అధిరోహించడానికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఎవరెస్టు అధిరోహించాలని కోరిక ఉన్నవారికి తాను శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.