ఎండీఎస్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల
మొదటి ర్యాంకు సాధించిన డాక్టర్ స్ఫూర్తి రెడ్డి
విజయవాడ, న్యూస్‌లైన్: మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) కోర్సులో ప్రవేశాలకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గతనెల 23వ తేదీన నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల చేసింది. మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో ఒకే మార్కులు (100కి 89) సాధించగా, బీడీఎస్ కోర్సులో మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.
ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని పుల్లారెడ్డి డెంటల్ (కర్నూలు) కళాశాలకు చెందిన డాక్టర్ కె.స్ఫూర్తి రెడ్డి ఫస్ట్ ర్యాంకు సాధించగా, ఎస్వీయూలోని నెల్లూరు నారాయణ డెంటల్ కళాశాల విద్యార్థి డాక్టర్ డి.రెడ్డి ప్రదీప్, గుంటూరు సీబార్ డెంటల్ కళాశాల విద్యార్థి రమేష్‌బాబు వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకుల్లో నిలిచారు. విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాల విద్యార్థిని డాక్టర్ వెంకట నవ్యత నాలుగో ర్యాంకు సాధించారు. మొత్తం 2,240 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1507 మంది అర్హత సాధించారు.