చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య!
నల్లగొండ(మఠంపల్లి): మఠంపల్లి మండలంలోని వర్దాపురం గ్రామపంచాయితీ పరిధిలోని రాజీవ్‌నగర్ కాలనీలో మల్లారపు దానయ్య (50) శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. మఠంపల్లి ఎస్‌హెచ్‌వో సుల్తాన్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు దానయ్య భార్య రూతమ్మ, కుమారుడు వీరబాబు వర్దాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కాగా రాత్రి ఇంటిలో దానయ్య ఒక్కడే నిద్ర పోయాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున మంచంపై విగతజీవుడై ఉన్న దానయ్య తలపై గొడ్డలితో నరికి చంపిన గాయాలు ఉన్నాయి.
దీంతో కుమారుడు వీరబాబు తన తండ్రి దానయ్యను గత కొంత కాలంగా చేతబడి చేస్తున్నావు నిన్ను ఎలాగైనా చంపుతామంటూ గ్రామానికి చెందిన పల్లె ప్రసాద్, శ్రీను అనే వ్యక్తులు పలుమార్లు మా ఇంటిపైకి వచ్చి బెదిరింపు లకు పాల్పడ్డారని తన తండ్రిని వారే హత్య గావించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పంచనామా నిమిత్తం హుజూర్నగర్ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. కాగా మృతునికి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
చేతబడి నెపంతోనే హత్య ...
కాగా మిర్యాలగూడ డీఎస్పీ గోనె సందీప్ ఆదివారం రాజీవ్‌నగర్ కాలనీలో హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం మఠంపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. దానయ్యను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన వారే హత్య గావించారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. రెండురోజులలో నిందితులను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఇన్ఛార్జ్ సీఐ కోట్ల నర్సింహారెడ్డి, హుజూర్నగర్ ఎస్ఐ అఖిల్‌జామా తదితరులున్నారు.