పురుడుకొస్తే.. పుట్టెడు కష్టాలు!
♦ ప్రసూతి విభాగంలో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కేసులు
♦ వార్డు చాలక ఇబ్బంది పడుతున్న రోగులు
తెనాలి అర్బన్:
జిల్లా వైద్యశాలలోని ప్రసూతి విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. వార్డులో రోగుల సంఖ్య ఎక్కువ కావటంతో బెడ్లు చాలక బాలింతలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొందరు బాలింతలు ఇన్ఫెక్షన్ సోకి ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి జిల్లా వైద్యశాలలో ప్రతిరోజూ సుమారు వంద మందికిపైగా గర్భిణీలు ఓపీ కింద వైద్య సేవలు పొందుతుంటారు. వీరు కాకుండా ప్రసూతి వార్డులోని 50 వరకు పరుపులు నిత్యం బాలింతలతో నిండి ఉంటాయి. అలాగే గైనిక్ వార్డు పక్కనే ఉండే గదుల్లో ఎన్ఎన్సీయులో చికిత్స పొందే చిన్నారుల తల్లులు ఉంటారు.
విస్తృతమైన సేవలు..
గతంలో గైనిక్ విభాగంలో వైద్య సేవలు అంతంత మాత్రంగా అందుతుండేవి. వైద్యుల కొరత వల్ల ఈ పరిస్థితి ఉండేది. అయితే మూడేళ్ల నుంచి గైనిక్ విభాగంలోని అన్ని పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఒకరు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ముగ్గురు, సీనియర్ రెసిడెంట్ ఒకరు పనిచేస్తున్నారు. దీంతో గైనిక్ వైద్యుల కొరత తీరినట్లు అయ్యింది. దీంతో గైనిక్ విభాగం రోగులతో నిత్యం నిండి ఉంటుంది. కొన్ని కేసులను గుంటూరు పంపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం బెడ్లు చాలక ప్రతి నెలా కొందరిని గుంటూరు పంపాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. జిల్లా వైద్యశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన తల్లి–పిలల్ల వైద్యశాలను త్వరగా ప్రారంభిస్తే గుంటూరు పంపే కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
ఇబ్బంది పడుతున్న రోగులు
ప్రసూతి వార్డులో రోగుల సంఖ్య పెరగటంతో ఒక్కో సందర్భంలో ఒక్క బెడ్పై ఇద్దర్ని పండుకోబెడుతున్న సందర్భాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే వార్డులో చికిత్స పొందుతున్న కొందరు బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకి ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల సిజేరియన్ చేయించుకున్న బాలింతలు కుట్లు మానక, వాటి నుంచి పస్ వస్తుందని పలువురు బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్థిక స్థోమత ఉన్న కొందరు బాలింతలు వెంటనే ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లి ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకుంటుండగా, మరికొందరు బతుకు జీవిడా అంటూ అక్కడే తగ్గే వరకు ఉండి అనంతరం వెళ్తున్నారు.
ఇన్ఫెక్షన్ తగ్గించే ఇళ్లకు పంపుతున్నాం..
గైనిక్ వార్డులో చికిత్స పొందే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రోగులను ఉంచే అవకాశంలేక గుంటూరు రిఫర్ చేయాల్సి వస్తోంది. వార్డులో చికిత్స పొందుతున్న బాలింతను చూసేందుకు ఎక్కువ సంఖ్యలో వారి బంధువులు వస్తున్నారు. వీరివల్ల కొందరు బాలింతలకు ఇన్ఫెక్షన్ వస్తున్న మాట వాస్తవం. అలాంటి రోగులకు కూడ మంచి యాంటిబయాటెక్స్ మందులు వాడుతున్నాం. చాలా వరకు ఇక్కడే వారి ఇన్ఫెక్షన్ తగ్గించి ఇళ్లకు పంపుతున్నాం.– డాక్టర్ సనత్ కుమారి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, తెనాలి