maternity ward
-
ప్రసూతి వార్డుకు ఊరట
సాక్షి, కాకినాడ: ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి మహర్దశ పట్టింది. ఇన్నాళ్లూ నిధులు లేక నీరసించిన వైద్యశాల ఇక అభివృద్ధి పథం పట్టనుంది. ఈ మేరకు రూ.20 కోట్ల నిధులతో ప్రసూతి విభాగానికి అవసరమైన భవన నిర్మాణాలకు పరిపాలనా అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. ప్రసూతి, చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన భవనాల నిర్మాణం, సామగ్రి కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతం అధ్వానం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధిక శాతం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ (సామాన్య ప్రభుత్వ ఆస్పత్రి) వస్తుంటారు. విష జ్వరాలతోపాటు మెటర్నటీ (ప్రసూతికి సంబంధించిన) కేసులు ఎక్కువ శాతం ఇక్కడికి వస్తుంటాయి. పూర్తి జాగ్రత్తలు తీసుకోవల్సిన గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబించింది. ప్రభుత్వ బోధనాస్పత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల నియామకం జరగలేదు. ముఖ్యంగా గైనిక్ వార్డులో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడేది. ఫలితంగా కీలక సమయంలో వైద్యం అందక చిన్నారులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి. ఆస్పత్రిలోని మాతా, శిశు ప్రసూతి విభాగంలో ఆరు యూనిట్ల పరిధిలో 180 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రతి రోజూ చికిత్స కోసం 550 మంది గర్భిణులు ఆస్పత్రికి వస్తుంటారు. రోజుకు 50 ప్రసవాలు అవుతుంటాయి. ఇందులో 20–25 వరకు సిజేరియన్లు చేస్తుంటారు. అవసరమైన బ్లెడ్లు లేకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోపెట్టి వైద్యం చేసిన సందర్భాలు కోకొల్లలుగా నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో నేలపైనే వైద్యం అందించే దయనీయ స్థితి తలెత్తింది. ఫలితంగా గర్భిణులకు సౌకర్యాలు కరువై చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన కూడా లేకపోలేదు. రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు ఆస్పత్రిలో ప్రస్తుతం ఆరు యూనిట్ల పరిధిలో 180 మంచాలు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రిలో ప్రతి నిత్యం 380 మంది గర్భిణులుంటున్నారు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలంటే మరో 450 మంచాలు అవసరం. ప్రస్తుత నిధులతో భవన నిర్మాణాలు, బెడ్లు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రసూతి సేవలు కొనసాగుతున్న భవనంపై అదనంగా గదులు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో తలమునకలవుతున్నారు. సీఎం మాట.. ఎమ్మెల్యే కృషి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సీఎం పిలుపు మేరకు కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో చదివి విదేశాల్లో స్థిరపడిన వారు కాకినాడ జీజీహెచ్‌లో మాతా, శిశు విభాగం అభివృద్ధి కోసం రూ.20 కోట్లు వెచ్చించేందుకు ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో అమరావతిలో ఎంవోయూపై సంతకాలు చేశారు. కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సమక్షంలో ప్రక్రియ పూర్తి చేశారు. అప్పటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎన్ఆర్ఐలను పలకరిస్తూ నిధులు ప్రభుత్వానికి మంజూరు చేయడంలో కీలక భూమిక పోషించారు. అంతేగాక ఎన్ఆర్ఐలను అందరికీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభివృద్ధికి నిధులు వెచ్చించాలని కోరారు. త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. -
ఉక్కరిబిక్కిరి బాలింతల వ్యథ
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని బాలింత వార్డు నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నవమాసాలు కష్టాలు పడుతూ చివరికి శిశువులకు జన్మనిస్తున్న తల్లుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. మండు వేసవి కావటంతో తీవ్రమైన ఉష్టోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బాలింతలు, పసిబిడ్డలు మాడిపోతున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని బాలింత వార్డులో తీవ్ర ఉక్కపోతతో వారు పడరాని పాట్లు పడుతున్నారు. సర్కారు దవాఖానాలో కనీస సౌకర్యాలు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. బాలింతల బాధలు పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో బాలింతల వార్డులో వారు పడుతున్న పాట్లకు ఈ చిత్రాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకవైపుఎండలు భగభగ మండిపోతుంటే.. బాలింతల వార్డులో కనీసం సౌకర్యాలు లేక తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గాలికూడా రాకపోవటంతో బాలింతల బంధువులు కొత్తగా టేబుల్ ఫ్యాన్లు కొనుగోలు చేసి మరీ ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వార్డులో ఏసీ ఉన్నా నెలరోజుల నుంచి పనిచేయటంలేదు. ఏసీ ఏర్పాటు చేసేందుకు తలుపులు, కిటికీలను సైతం పూర్తిగా మూసివేయటంతో గాలి ఆడక.. ఊపిరి తీసుకోవటమే కష్టంగా మారిందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వార్డులో ఉన్న ఒకటో, రెండో ఫ్యాన్లు సైతం పనిచేయని దుస్థితి నెలకొంది. దీంతో బాలింతలతో పాటు అప్పుడే పుట్టిన చిన్నారులు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పిల్లలు ఉక్కపోతతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమ బిడ్డల కోసం తల్లులు, వారి బంధువుల పాట్లు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఒక్కో బెడ్ వద్ద ఒక్కో ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకుని కొద్దిపాటి ఉపశమనం పొందుతున్నారు. ఏసీ వార్డులో ఏసీలు పనిచేయటంలేదని తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి కానరావటంలేదు. బాలింతల వార్డులో పరిస్థితిపై ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ నంబర్ పనిచేయటంలేదని సమాధానం వస్తోంది. తట్టుకోలేకపోతున్నాం వార్డులో బాలింతలు పడుతున్న బాధలు చెప్పలేం. కనీసం గాలి కూడా రాని పరిస్థితి. మేమే కొత్త ఫ్యాన్లు కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకున్నాం. చంటి బిడ్డలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలింతలు వేడికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. వార్డులో చుట్టూ కిటికీలు సైతం మూసివేసి ఉండడంతో గాలి లోనికి వచ్చే అవకాశం లేదు. అయినా అధికారులెవరూ పట్టించుకోవటంలేదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా ఉంది. బాలింతలకు కనీసం గాలి ఆడేలా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. – భాగ్యలక్ష్మి, బాలింత బంధువు -
సూర్యాపేట ఆసుపత్రిలో గర్బిణుల కష్టాలు
-
గైనిక్‌కు పురిటి నొప్పులు
మాతా శిశు మరణాల నివారణకు కృషి చేస్తామంటూ పాలకులు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. లక్ష్యాలను అధిగమించడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. సర్వజనాస్పత్రిలో నెలకు 900 ప్రసవాలు జరిగే విభాగానికి పట్టుమని పది మంది మెటర్నిటీ అసిస్టెంట్లను ఏర్పాటు చేయలేదు. అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో గైనిక్ సేవలు మృగ్యంగా మారాయి. గైనిక్ విభాగానికి కొన్నేళ్లుగా మెటర్నిటీ అసిస్టెంట్ల (ఏఎన్ఎం) కొరత పట్టిపీడిస్తోంది. దీంతో గర్భిణులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసిస్టెంట్ల పని సైతం తామే చేయాల్సి వస్తోందని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం కలెక్టర్ వీరపాండియన్ అధ్యక్షతన ఆస్పత్రిలో జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో మెటర్నిటీ అసిస్టెంట్లను ఆరోగ్యశాఖ నుంచి డెప్యూట్ చేసుకోవాలని మినిట్స్‌లో పొందుపర్చారు. కానీ ఇంత వరకు సిబ్బందిని నియమించిన దాఖలాలు లేవు. ముగ్గురే మిగిలారు.. కాన్పుల (లేబర్) వార్డులో ముగ్గురు మెటర్నిటీ అసిస్టెంట్లు సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరంలో 11 మంది మెటర్నిటీ అసిస్టెంట్లను తీసుకున్నారు. అందులో ముగ్గురు మినహా మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ఇంత వరకు మెటర్నిటీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయలేదు. లేబర్‌వార్డులో రోజూ 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 7 సిజేరియన్లు, 20 నుంచి 23 సాధారణ ప్రసవాలు జరుగుతాయి. సాధారణ ప్రసవాలు జరిగే సమయంలో మెటర్నిటీ అసిస్టెంట్లు తప్పనిసరి. వైద్యులకు సహాయకులుగా వారుండాలి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కన్పించడం లేదు. ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో పతి ఒత్తిడితో పాటు మెటర్నిటీ అసిస్టెంట్ల కొరత పెద్ద సమస్యగా మారింది. వందల సంఖ్యలో ఏఎన్ఎం పోస్టుల ఖాళీ వైద్య ఆరోగ్యశాఖలో 828 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. 498 మంది రెగ్యులర్ పోస్టులుండగా అందులో 140 ఖాళీలున్నాయి. అలాగే 586 కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలలో 110 మంది ఖాళీలున్నాయి. పీహెచ్సీ, మదర్ పీహెచ్‌సీల్లో ప్రసవాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అక్కడి మెటర్నిటీ అసిస్టెంట్లను మూడు నెలలకోసారి డెప్యూట్ చేస్తే బాగుంటుందని గైనిక్ వైద్యులు కోరుతున్నారు. ఆరోగ్యశాఖ మాత్రం సిబ్బంది కొరతను చూపి పట్టించుకోవడం లేదు. అందరి సమన్వయంతోనే మాతాశిశు మరణాల నియంత్రణ సాధ్యపడుతుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. డెప్యూట్ చేసే ప్రసక్తే లేదు పీహెచ్‌సీల్లో 240 ఏఎన్ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇన్ని ఖాళీలు పెట్టుకుని ఆస్పత్రికి ఏవిధంగా డెప్యూట్ చేయాలి. కలెక్టర్ నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలూ లేవు. హెచ్‌డీఎస్‌లో మినిట్స్‌లో మెటర్నిటీ అసిస్టెంట్లు కావాలని నమోదు చేశారు. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డీఎంహెచ్ఓ -
రైలు బోగినే.. ప్రసూతి గదైన వేళ
సీతాపూర్: రైలు బోగే ఆ తల్లికి ప్రసూతి గది అయింది. స్ధానిక రైల్వే పోలీసు ఆమె పాలిట దేవుడయ్యాడు. అధికారులు, తోటి ప్రయాణికుల సాయంతో ఆ మహిళ రైలు బోగిలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జననాయక్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం సుమన్ దేవీ (30), తన భర్త హరి ఓంతో కలిసి ప్రసవం కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌కి బయలుదేరింది. మార్గమధ్యలో సుమన్ దేవికి నొప్పులు ప్రారంభమయ్యాయి. రైలు సీతాపూర్ చేరుకునే సరికి పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఆమె భర్త హరిఓం సీతాపూర్ స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి (జీఆర్పీ) సురేష్ యాదవ్‌ని సహాయం చేయవలసిందిగా కోరాడు. అదృష్టవశాత్తు ఆ అధికారి కూడా డాక్టర్ కావడంతో ఆయన వెంటనే స్పందించి తన తోటి మహిళా కానిస్టేబుల్, ఇతర మహిళా ప్రయాణికుల సాయంతో సుమన్ దేవికి రైలు బోగిలోనే ప్రసవం చేశారు. సుమన్ దేవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ లోపు అధికారులు అంబులెన్స్‌ని ఏర్పాటు చేయడంతో తల్లి, బిడ్డలను సీతాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రైలు ఒక గంట ఆలస్యమైంది. రైలులోనే ప్రసవం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సల్మా షైక్ (26) అనే మహిళ ముంబై లోకల్ రైలులోనే ప్రసవించింది. సల్మా ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు వెళ్తుండగా ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే సమీప దాదర్ స్టేషన్‌లోని ఒక్క రూపాయి ఆస్పత్రి వైద్యులు వచ్చి ఆమెను పరీక్షించారు. సల్మాకు క్రోనింగ్ మొదలవ్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే వ్యవధి లేకపోయింది. వెంటనే రైలులోని ఆడవారి కంపార్ట్మెంట్లో ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం తల్లీ, బిడ్డలను సమీప కేయీఎమ్ ఆస్పత్రికి తరలించారు. ముంబై లోకల్ రైలులో సల్మా షైక్ బిడ్డతో రైల్వే అధికారులు, వైద్య సిబ్బంది (పాత ఫొటో) -
గుంటూరు జీజీహెచ్‌లోని ప్రసూతి వార్డులో చోరీ
గుంటూరు : గుంటూరు జీజీహెచ్ ప్రసూతి వార్డులోని ఫ్యాన్లను ఆగంతకులు చోరీ చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది బుధవారం ఉదయం గుర్తించారు. ఆ విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా ప్రసూతి వార్డులోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.