పెళ్లికి యువతరం చెప్తున్న సాకులు ఇవే!
న్యూఢిల్లీ: జీవితంలో ప్రతిఒక్కరూ తమకు తెలిసి చేసుకునే అతిపెద్ద పండుగ పెళ్లి. అటువంటి పండుగను సంవత్సరాల తరబడి నేటి యువతరం ఎందుకు దూరంగా నెట్టేస్తుందో తెలుసా? భారతదేశంలోని అతిపెద్ద ఆన్ లైన్ మ్యాట్రిమోనియల్ సంస్థ భారత్ మ్యాట్రిమోనియల్ నిర్వహించిన ఓ సర్వేలో భారత యువతరం పెళ్లిని వాయిదా వేయడానికి చెప్తున్న సాకులు చూస్తే ముక్కు మీద వేలేసుకుంటారు.
సర్వేలో కొంతమంది యువతీ, యువకులను సంస్థ నిపుణులు 10 రకాల ఆలోచనాత్మక ప్రశ్నలను సంధించారు. వాటిలో కొన్నింటికి వచ్చిన సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి.
అబ్బాయిలేమంటున్నారంటే..
వయసు తక్కువని పెళ్లిని వాయిదా వేయడం కరెక్టా? అని సంస్థ ప్రశ్నిస్తే.. పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మానసికంగా అందుకు సిద్ధంకావాలని అందుకు సమయం పడుతుందని చక్కగా సమాధానం ఇచ్చేశారు. 'నా స్నేహితులందరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అప్పుడే నాకు పెళ్లేంటీ. నాకు ఇంకా అంత స్థిరత్వం రాలేదు. నేను తగినంత డబ్బు సేవ్ చేయలేదు. నాకు ప్రతి వారం షాపింగ్ చేయాలంటే చిరాకు. వంట వండటం నేర్చుకోవడానికి నాకు సమయం కావాలి' లాంటి సిల్లీ సమాధానాలు కూడా ఇచ్చారు.
అమ్మాయిలేమంటున్నారంటే..
అమ్మాయిలు పెళ్లిని తప్పించుకునేందుకు చెప్పిన సాకులు అదరహో అనిపించాయి. 'ఇంకొన్ని సంవత్సరాలు నేను అమ్మా, నాన్నలతో కలిసి ఉండాలి. అత్త, కోడళ్ల డ్రామాలోకి నేను అంత తొందరగా వెళ్లాలనుకోవడం లేదు. నేను మంచి కోడలిని కాలేనేమో అనిపిస్తుంది. ఇంటిపనులు అప్పుడే చేయాలని లేదు. ముందు నన్ను నా రాకుమారుడిని వెతుక్కొనివ్వండి' లాంటి సమాధానాలతో వారికి వారే సాటి అనిపించారు.
ప్రస్తుతం దీనిపై ఇంకా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఈ కార్యక్రమం ద్వారా యువతీ, యువకులను వివాహానికి సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందని హ్యాపీ మ్యారేజెస్ హెడ్ అన్నారు. యువతీ, యువకులు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని అంశాలను గుర్తించామని చెప్పారు. పెళ్లి చేసుకునే ముందు అందరూ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారని తెలిపారు. పెళ్లికి వయసుతో సంబంధం లేదని మెచ్యురిటీ ఉంటే చాలని భావిస్తున్నట్లు వివరించారు. వివాహానికి ముందు ఆర్ధికంగా కూడా సెటివ్వాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారని అది నిజమని అన్నారు.