నిర్భాగ్యులే దేవుని గుండె చప్పుళ్లు
సువార్త
అరేబియన్ గుర్రాలకిచ్చే శిక్షణ చాలా కఠినమైనది. చివరి పరీక్షగా ట్రెయినర్ గుర్రాలకు కొన్ని రోజులపాటు నీళ్లివ్వకుండా పరిగెత్తిస్తాడు. అవి విపరీతమైన దాహంతో ఉన్నప్పుడు ఒక చెరువు వద్దకు వాటిని తోలుతాడు. అవి ఆశతో నీళ్లు తాగబోతూండగా విజిల్ వేసి వెనక్కి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ దశలో ఒకటో రెండో గుర్రాలు మాత్రమే నీళ్లు తాగకుండా వెనక్కి వస్తాయి. పరుగెత్తడంతోపాటు విధేయత కూడా నేర్చుకున్న ఆ గుర్రాలే అత్యుత్తమమైనవిగా అధిక ధర పలుకుతాయి.
నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించ మన్న యేసుప్రభువు అందుకు ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఒక వ్యక్తి ప్రయాణిస్తూ దొంగల బారిన పడ్డాడట!! దొంగలతన్ని విపరీతంగా కొట్టి కొనప్రాణంతో వదిలి పోయారు. యూదుమతాచార్యులైన ఒక యాజకుడు, లేవీయుడు అటుగా వచ్చి కూడా అతన్ని పరామర్శించకుండానే వెళ్లిపోయారు. కాని ఆలయ ప్రవేశార్హత కూడా లేని తక్కువ జాతివాడైన ఒక సమరయుడు అతని మీద జాలిపడి, పరామర్శించి, అతని గాయాలు కడిగి, కట్టు కట్టి తన వెంట తీసుకెళ్లి ఒక పూటకూళ్ల వాని ఇంట్లో చేర్చాడు. అతన్ని చూసుకోవడానికి డబ్బు కూడా చెల్లించాడు. అపరిచితుడైన ఒక నిర్భాగ్యునికి సమరయుడు చేసిన ఈ పరిచర్యను యేసుప్రభువు కొనియాడి, నిజమైన పరిచర్య ఇదేనన్నాడు (లూకా10:25)
యేసు చేసిన అత్యంత విప్లవాత్మకమైన ప్రబోధమిది. ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేయడం కాదు, దాని సారాన్ని గ్రహించి దానికి విధేయత చూపించడమే అత్యున్నతమైన పరిచర్య అన్నాడు ప్రభువు. తాము దేవునికి ఎంతో దగ్గరి వారమన్న భ్రమతో ఉన్న యాజకుడు, లేవీయుడు నిజానికి దేవునికి ఎంత దూరంగా ఉన్నారో, ధర్మశాస్త్రం, దేవుడు, ఆలయం, ఆరాధన ఇవేవీ తెలియని సమరయుడు దేవుని హృదయస్పందనకు ఎంత దగ్గరగా ఉన్నాడో ప్రభువు వివరించాడు. పుస్తకం చదివిన వారికి ఆ పుస్తక రచయిత గురించి తెలియాల్సిన అవసరం లేదు. కాని బైబిల్ చాలా విలక్షణమైన గ్రంథం.
అది చదివేకొద్దీ దాని రచయిత అయిన దేవుడు అంతకంతకూ మరెక్కువగా అర్థం కావాలి. దేవుని హృదయ స్పందనంతా నిర్భాగ్యులూ, నిరుపేదల కోసమేనన్నది అప్పుడర్థమవుతుంది. ఆదిమ కాలంలో చర్చిలు అది అర్థం చేసుకున్నాయి. అందుకే నాటి విశ్వాసులంతా తమ ఆస్తులు సైతం అమ్మి తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద పెట్టారు. అలా పరుగెత్తడాన్ని, విధేయతను కూడా ఆదిమ చర్చిలు నేర్చుకున్నాయి. కాని నేటి చర్చిలకు పరుగెత్తడంలో ఉన్న శ్రద్ధ, విధేయత చూపించడంలో కనిపించడం లేదు. దేవుడు తమనుండి ఏం కోరుకుంటున్నాడన్న అవగాహన విశ్వాసుల్లో, చర్చిల్లో లోపించింది. ఫలితంగా నిరుపేదల కోసం కొత్తగా అనాథాశ్రమాలు, ఉచిత స్కూళ్లు, ఆసుపత్రులు తెరిచి పరిచర్య చేయవలసింది పోయి ఉన్నవి కూడా మూసేస్తున్నారు. ఖరీదైన కార్లు, సూట్లు, చీరలు, నగలు, సంభాషణలతో నిండిన నేటి చర్చిలు షాపింగ్ మాల్స్‌ను తలపింప చేస్తున్నాయే తప్ప, తనకంటూ తల దూర్చుకోవడానికి కూడా సొంత స్థలం లేనంతగా తనను తాను తగ్గించుకొని వచ్చి నిరుపేదలను, నిర్భాగ్యులను ఆలింగనం చేసుకున్న యేసుక్రీస్తు ఆరాధనాస్థలాలుగా మాత్రం కనిపించడం లేదు.
దాతృత్వంతో ప్రేమను, క్షమాపణను, ఆదరణ ను పంచాల్సిన చర్చిలు కుత్సితత్వం, కృత్రిమత్వం, కుతత్వానికి కేంద్రాలయ్యాయి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్న ప్రభువు బోధను అటకెక్కించి ‘నిన్ను నీవే ప్రేమించుకో! అన్న కొత్త ప్రబోధాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఫలితంగా ఖరీదైన ఏసీ వాతావరణంతో దైవిక మూలసూత్రాలు తెలియని పాస్టర్లు, భక్తుల మధ్య దేవుడున్నాడన్న భ్రమతో చర్చి లోపల ఆయన్ను ఆరాధిస్తున్నాం. కాని చర్చి బయట గుడి మెట్ల మీద కూర్చొని భిక్షాటన చేస్తున్న నిర్భాగ్యుల పరామర్శ కోసం వారి మధ్యే ఉండి వారి కోసం తహ తహలాడుతున్న యేసుక్రీస్తును చూడలేని అంధులమయ్యాం.
(మత్త 25:31-40) - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్