ఆసీస్ కెప్టెన్ల పోరు..నెగ్గేదెవరు
ఇండోర్: ఐపీఎల్-10 లో భాగంగా సోమవారం జరిగే పంజాబ్, బెంగళూరు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తాత్కలిక కెప్టెన్ ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మాక్స్‌వెల్‌ల మధ్య పోటికి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. ఈ రసవత్తర పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. పంజాబ్ తొలి మ్యాచ్ రైజింగ్పుణేపై గెలిచి ఊపు మీద ఉంది. బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ పై గెలిచి బోణి కొట్టింది. ఇరు జట్లు గెలుపుపై కన్నెశాయి. గాయంతో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు దూరమైన బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లి, డివిలియర్స్‌లు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ఒక వేళ ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడితే బెంగళూరు బ్యాటింగ్ పటిష్టం కానుంది. ఇప్పటికే విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్, కేదార్ జాదవ్, షేన్ వాట్సన్లతో జట్టు పటిష్టంగా ఉంది. అయితే గేల్ ఫాం మాత్రం బెంగళూరును కలవరపెడుతుంది. గేల్ జరిగిన రెండు మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు. బౌలింగ్‌లో యజువేంద్ర చాహాల్, తైమిల్ మిల్స్, బిల్లీ స్టేన్లేక్లతో బైలింగ్ లైనప్ పర్వాలేదు. ఢిల్లీ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో చెలరేగిన కేదార్ జాదావ్ ఫాం కంటిన్యూ అయితే బెంగళూరు విజయం కాయం. రైజింగ్ పుణేపై గెలిచి ధీమాతో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ గెలుస్తామనే విశ్వాసంతో ఉంది. మ్యాక్స్‌వెల్ మెరుపులకు మిల్లర్ తోడు నిలవడంతో పుణేపై పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండోర్‌లో జరిగే ఈ మ్యాచ్ మాత్రం అభిమానులను కనువిందు చేయనుంది.