నిర్మాతే దర్శకుడైతే లాభం
నిర్మాతే దర్శకుడైతే లాభం ఉందంటున్నారు తొలిసారిగా మోగాఫోన్ పట్టిన సక్సెస్ఫుల్ నిర్మాత సీవీ.కుమార్. తిరుకుమరన్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి నూతన నిర్మాతలకు మార్గదర్శిగా నిలిచిన సీవీ.కుమార్ దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కిస్తున్న చిత్రం మాయవన్. సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఇందులో డేనియల్ బాలాజీ, బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీష్రాష్, భగవతి పెరుమాళ్, మైమ్‌గోపీ, జయప్రకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
నటి అక్షరగౌడ్ అతిథి పాత్రలో మెరిసిన ఈ చిత్రానికి కథనం, సంభాషణలను నలన్‌కుమారస్వామి, సంగీతాన్ని జిబ్రాన్, ఛాయాగ్రహణను గోపి అమరనా«థ్ అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ సోమవారం మధ్యాహ్నం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, ధనుంజయన్లు చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో సందిప్ కిషన్ మాట్లాడుతూ సీవీ.కుమార్ దర్శకత్వంలో నటించడం గర్వంగా ఉందన్నారు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో నటించిన తొలి హీరోగా గుర్తుండిపోతానని అన్నారు.
ఇంకో విషయం ఏమిటంటే ఆయన నిర్మించిన చిత్రాలకే బాగా ప్రచారం చేస్తారని, ఈ చిత్రానికి దర్శకుడు కూడా కావడంతో మరింత పబ్లిసిటీ చేస్తారని ఆ విధంగానూ తాను హ్యాపీ అన్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీష్రాష్తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. దర్శకుడు సీవీ.కుమార్ మాట్లాడుతూ దర్శకత్వం చేయడానికి ముందు చాలా నెర్వెస్‌గా ఫీలయ్యానని అన్నారు. అయితే ఈ చిత్రానికి పని చేసిన వారందరి సహకారంతో తాను అనుకున్న కథను సమర్థవంతంగా తెరకెక్కించాననుకుంటున్నానని అన్నారు.
ఇది మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో కూడిన చిత్రం అని తెలిపారు. సందీప్‌కిషన్ పోలీస్ అధికారిగా, లావణ్య త్రిపాఠి సైక్రియాటిస్ట్‌గా చక్కగా నటించారని ప్రశంసించారు. చిత్రానికి జిబ్రాన్ అద్బుతమైన నేపధ్య సంగీతాన్ని అందించారన్నారు. దర్శకత్వం కష్టతరమైన బాధ్యత అయినా నిర్మాతే దర్శకుడైతే ప్రొడక్షన్ ఖర్చులను కంట్రోల్ చేసుకునే సౌలభ్యం ఉందని సీవీ.కుమార్ అన్నారు. చిత్రాన్ని మే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.