ఈ-టౌన్ ప్లానింగ్
సాక్షి, సిటీబ్యూరో : భవన నిర్మాణ అనుమతుల కోసం సిటీజనులు ఇక రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. టౌన్ ప్లానింగ్ విభాగంలో ‘ఆన్లైన్’ విధానాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ఈ విధానాన్ని శనివారం సాయంత్రం మేయర్ మాజిద్ హుస్సేన్ లాంఛనంగా ప్రారంభించారు. ఇకనుంచి భవన అనుమతుల కోసం ప్రజలు జీహెచ్ఎంసీ కార్యాలయాల వరకు రాకుండా ఇంటి నుంచి, లేదా ఈసేవా కేంద్రాల నుంచి, ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంతవరకు మరే ఇతర మునిసిపాలిటీలో కాని, మునిసిపల్ కార్పొరేషన్లో కానీ లేని ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించిందని మేయర్ మాజిద్ హుస్సేన్ తెలిపారు. దీని ద్వారా అధికారులకు జవాబుదారీతనంతోపాటు ఫైల్ కదలికలో పారదర్శకత ఉంటుందన్నారు. దరఖాస్తులు సమర్పించడం నుంచి అనుమతులు పొందేంత వరకు గ్రేటర్ ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల్ని తొలగించేందుకు ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు.
వివిధ ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులకు అవసరమైనన్ని నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 325 పనులకు రూ. 69.83 కోట్లు మంజూరు చేశామన్నారు. డీసిల్టింగ్ పనులకు రూ.21.18 కోట్లు మంజూరు చేశామన్నారు. సీసీరోడ్లు, తదితర పనులకు కూడా నిధులు మంజూరుచేశామని చెప్పారు. 13 మల్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా తాను తొలి సంతకం చేసిన 42 వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతించిందని సోమేశ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
పనితీరిలా...
జీహెచ్ఎసీ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుంటే మొబైల్ ద్వారా పాస్వర్డ్ వస్తుంది.
యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తును సమర్పించాలి.
దరఖాస్తుకు సంబంధించి యునిక్ నెంబరు వస్తుంది.
అనుమతి పొందేంతవరకు ఆ నెంబరుతోనే ఫైల్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ప్రింట్‌ఔట్‌ను పొంది, సంబంధిత అధికారి సంత కంతో తీసుకోవచ్చు.
ఆన్లైన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, మాన్యువల్‌గా కూడా దర ఖాస్తులు స్వీకరిస్తారు.
క్రమేపీ పూర్తిగా ఆన్‌లైన్‌ను అమలు చేస్తారు.
ప్రస్తుతం నివాస భవనాల దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు.
కొద్దిరోజుల్లో అన్ని భవనాల, బహుళ అంతస్తుల దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు.
పాత దరఖాస్తులన్నింటినీ ఫిబ్రవరి 28 లోగా పరిష్కరించడమో, తిరస్కరించడమో చేస్తారు.
నిరక్షరాస్యుల కోసం ఈసేవ, పౌరసేవా కేంద్రాల ద్వారా సమర్పించేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉపయోగాలివీ...
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణతో పారదర్శకతకు వీలుంటుంది.
అనుమతుల జారీలో జాప్యానికి తావుండదు.
ఎప్పటికప్పుడు దరఖాస్తు ఎవరి వద్ద ఉందో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.
సిటిజన్ చార్టర్ మేరకు ఏ పనైనా నిర్ణీత వ్యవధిలోనే జరుగుతుంది.
ఫైలు ఎక్కడైనా ఆగితే తెలుస్తుంది. అభ్యంతరాలున్నా తెలియజేస్తారు.
ప్రజలకెంతో సమయం కలిసి రావడమే కాకుండా ఫైలు త్వరితంగా పరిష్కారమవుతుంది.