అందరి సహకారంతో అభివృద్ధి
నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశామని మేయర్ మాజిద్‌హుస్సేన్ అన్నారు. పాలక మండలి పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో వివిధ అంశాల్లో నగరాన్ని ప్రగతిపథంలో నడిపించామన్నారు. ఓ వైపు నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే మరోవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజకు మెరుగైన సేవలందించేందుకు ప్రయత్నించానన్నారు. తాను మేయర్‌గా ఉన్న 35 నెలల్లో జీహెచ్ఎంసీ ఆర్థికంగా బలం పుంజుకుందన్నారు. ప్రజలపై ఎలాంటి పన్నులు వేయబోయనన్న హామీని అమలు చేస్తూనే ఆదాయాన్ని పెంచామని గుర్తు చేశారు. రూ.4 వేల లోపు వారికి ఆస్తిపన్ను మినహాయింపు అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ధీమా వ్యక్తం చేశారు. వరదనీటి కాలువల ఆధునికీకరణ, ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు, ఫ్లై ఓవర్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి పూర్తయితే ప్రజల ఇబ్బందులు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని నగరాలతో పరస్పర సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకున్నామని మేయర్ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీసైతం బ్రిస్బేన్ జీ-20 సదస్సులో హైదరాబాద్ నగరం గురించి ప్రస్తావించడాన్ని గుర్తు చేశారు.
పేదలకు వడ్డీలేని రుణాలు, అభయహస్తం, బంగారుతల్లి, వికాసం, ఆసరా తదితర ప్రభుత్వ పథకాలు సమర్ధంగా అమలు చేశామన్నారు. రూ. 5కే భోజనం, నైట్‌షెల్టర్ల ఏర్పాటు గురించీ ప్రస్తావించారు. తన హయాంలోనే కాప్ సదస్సు, మెట్రోపొలిస్ సద స్సులు నిర్వహించడం సంతోషాన్నిచ్చాయని చెప్పారు. మేయర్‌గా విధి నిర్వహణలో సహకరించిన అన్ని పార్టీలకూ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ జాఫ్రి, జీహెచ్ఎంసీలో ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ పాల్గొన్నారు.
మేయర్‌ను కలిసిన కమిషనర్
జీహెచ్ఎంసీ పాలక మండలికి చివరి రోజైన బుధవారం మేయర్ మాజిద్హుస్సేన్ను ఆయన చాంబర్లో కమిషనర్ సోమేశ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మేయర్‌గా నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కమిషనర్ కొనియాడారు. దీనికి మేయర్ స్పందిస్తూ కమిషనర్, సీనియర్ అధికారుల సహాయ సహకారాలతోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంత మయ్యాయని మేయర్ మాజిద్ కృతజ్ఞతలు తెలిపారు.