ముంచిన మక్క
ధర పెరిగినా.. దిగుబడి రాకపాయె
గతేడాది రేటును చూసి
సాగు చేసిన రైతులు
వర్షాలు లేక
ఎండిపోయిన పంటలు
పెట్టుబడి కూడా రాక
ఆందోళనకు గురవుతున్న కర్షకులు
జిల్లా వ్యాప్తంగా 58,044 హెక్టార్లలో పంటల సాగు
కేసముద్రం : కొండ నాలుకకు మందు వేస్తే..ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా మారింది జిల్లాలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి. వాణిజ్య పంట పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులను సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని ప్రభుత్వం పలు సూచనలు చేయడంతోపాటు మార్కెట్లో గతేడాది మక్కలకు ధర బాగా పలకడంతో జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు దీనివైపే మొగ్గుచూపారు.
అయితే సీజన్ ప్రారంభంలో మురిపించిన వరుణుడు తర్వాత ముఖం చాటేయడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న ఎండిపోయింది. లాభాల కోసం ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఖరీఫ్ సీజన్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న 50,015 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా, 58,044 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది మార్కెట్లలో ప్రభుత్వ మద్దతు ధరకు మించి రేటు ఉండడంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగువైపు మొగ్గుచూపారు. గత జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా జూన్‌లో 137.2 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం ఉండగా, 244.52 మి.మీ వర్షపాతం నమోదైంది. జూలైలో 287.75 మి.మీ సాధారణ వర్షపాతం ఉండగా, 276.73 వర్షపాతం నమోదైంది. ఆగస్టు మొదటి వారంలో 48.25 మి.మీ వర్షపాతం కురవగా, తర్వాత పలుచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎండిపోతున్న మొక్కజొన్నను బతికించుకునేందుకు బావులపై ఆధారపడిన రైతులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే భూగర్భజలాలు అడుగంటి పోవడంతో పాటు సరిగా నీళ్లు పారకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు వచ్చాయి. పలుచోట్ల మోకాలు దశ నుంచి తలనెరిసే దశ, కంకి దశ, గింజపాల దశ వరకు వచ్చి ఆగిపోయి ఎండిపోతున్నాయి. దీంతో పలువురు రైతులు మనోవేదనకు గురై తమ పంటలను పశువులకు మేతగా అందిస్తున్నారు. కాగా, కొన్ని చోట్ల ఎకరాకు 10 క్వింటాళ్ల లోపే దిగుబడులు రావడంతో వారు లబోదిబోమంటున్నారు.
వెలవెలబోతున్న మక్కల రాశులు
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో గతేడాదితో పోల్చితే ఈసారి మక్కల రాశులు వెలవెలబోతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 15,395 క్వింటాళ్లు, అక్టోబర్‌లో 65,257 క్వింటాళ్లు, నవంబర్‌లో 6,807 క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి రాగా.. ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం 672 క్వింటాళ్లు మాత్రమే అమ్మకానికి వచ్చాయి. మొత్తంగా గతేడాది 87,459 క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి రాగా.. ఈసారి ఇప్పటివరకు సగం కూడా రాలేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మక్కలకు మద్దతు ధర క్వింటాకు రూ.1325 ఉండగా, గత సెప్టెంబర్‌లో క్వింటాకు గరిష్ట ధర రూ.1567, అక్టోబర్‌లో గరిష్ట ధర రూ.1456, నవంబర్‌లో గరిష్ట ధర రూ.1592 పలికింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం 350 క్వింటాళ్ల మక్కలు రాగా, గరిష్ట ధర రూ.1761, కనిష్ట ధర రూ.1401లు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ధర విపరీతంగా పెరిగినప్పటికీ దిగుబడి బాగా తగ్గడంతో రైతులు బోరున విలపిస్తున్నారు.