విధుల బహిష్కరణ!
సాక్షి, చెన్నై: వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని, తమ శాఖ పరిధిలోని రిజిస్ట్రేషన్ విభాగంతో సమానంగా వసతులు కల్పించాలని, పదోన్నతుల్లో, ఇతర వ్యవహారాల్లో నెలకొన్న గందరగోళాన్ని చక్కదిద్దాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న 25 రకాల డిమాండ్లను వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఇటీవల తెరపైకి తెచ్చారు. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా తమ సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేసిన ప్రకటనల్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈ ఆందోళనలు ఆ శాఖ మంత్రి బివి రమణకు శిరోభారంగా మారాయి. ఉద్యోగుల్ని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఆందోళనలు మాత్రం ఆగలేదు. చివరకు బివి రమణ పదవిలో మార్పు చోటుచేసుకుంది. వాణిజ్య శాఖలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్దడం కొత్త మంత్రి ఎంసి సంపత్‌కు సవాల్‌గా మారింది. అయితే, తాము మాత్రం మెట్టు దిగే ప్రసక్తే లేదన్నట్టుగా ఉద్యోగులు ముందుకెళ్లున్నారు.
విధుల బహిష్కరణ: తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా మంగళవారం నుంచి ఆందోళన ఉధృతం చేశారు. రాష్ట్రంలో 500 వరకు ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లోని ఏడు వేల మంది సిబ్బంది విధుల్ని బహిష్కరించారు. బుధ, గురు వారాల్లో సైతం ఈ సమ్మె కొనసాగనుంది. ఉద్యోగులందరూ విధుల్ని బహిష్కరించడంతో ఉన్నతాధికారులు మొక్కుబడిగా తమ సీట్లలో వచ్చి కూర్చుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కార్యాలయాలు బోసిపోయాయి. వ్యవహారాలు పూర్తిగా స్తంభించాయి. వాణిజ్య పన్నుల వసూళ్లు ఆగడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.
ఈ విషయమై ఆ ఉద్యోగుల సంఘం నాయకుడు జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమల్లో 25 శాతం నిధులు వాణిజ్య పన్నుల సిబ్బంది శ్రమ ఫలితంగా వచ్చినవేనని చెప్పారు. ఆదాయన్ని సమకూర్చే తమకు ఎలాంటి వసతుల్ని కల్పించక పోవడం విచారకరమన్నారు. అసెంబ్లీ వేదికగా తాత్కాలిక ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయనున్నట్టు ఇది వరకు మంత్రిగా ఉన్న బివి రమణ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రకటన వెలువడి ఏడు నెలలు అవుతున్నా, ఆచరణకు మాత్రం నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే విధంగా కొత్త మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం దిగి రావాలన్న కాంక్షతో మూడు రోజుల పాటుగా విధుల్ని బహిష్కరిస్తున్నామని, రాని పక్షంలో ఆందోళన ఉధృతం అవుతుందని హెచ్చరించారు.