మంగళూరు కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అవకతవకలు
♦ ఎర్నస్ట్ అండ్ యంగ్ ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడి
♦ విజయ్ మాల్యాకు మరిన్ని చిక్కులు
న్యూఢిల్లీ: బ్యాంక్ రుణ ఎగవేతల విషయమై అప్రతిష్ట పాలైన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాను మరిన్ని చిక్కులు చుట్టుముడుతున్నాయి. ఆయన గ్రూప్‌కే చెందిన మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఎంసీఎఫ్ఎల్) కంపెనీ ఇతర గ్రూప్ కంపెనీల్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ సక్రమంగా లేవని ఒక ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్‌కు అనుబంధ సంస్థ అయిన బెంగళూరు బెవరేజేస్లో రూ.200 కోట్ల ఎంసీఎఫ్ఎల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎర్నస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పీచే ఫోరెన్సిక్ ఆడిట్‌ను ఎంసీఎఫ్ఎల్ నిర్వహించింది.
మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీ నియంత్రణను మాల్యా నుంచి గత ఏడాది జువారి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ పొందింది. ఇక ఈ ఆడిట్ నివేదికను శుక్రవారం ఎర్నస్ట్ అండ్ యంగ్ సంస్థ మంగళూరు కెమికల్స్ కంపెనీ డెరైక్టర్ల బోర్డ్‌కు నివేదించింది. ఎంసీఎఫ్ఎల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని, ఈ నివేదిక పేర్కొందని ఎంసీఎఫ్ఎల్ బీఎస్ఈకి నివేదించింది. ఈ విషయమై అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటామని పేర్కొంది. కాగా శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో ఎంసీఎఫ్ఎల్ కంపెనీ ఈ 200 కోట్ల పెట్టుబడులకు కేటాయింపులు జరిపింది.