దేశం కోసమైనా అప్పులు తీర్చండి
డిఫాల్టర్లకు పీఎన్బీ ఎండీ ఉష సూచన
న్యూఢిల్లీ: చెల్లించగలిగే సామర్థ్యమున్న డిఫాల్టర్లు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునైనా తీసుకున్న అప్పుల్ని తీర్చాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ సూచించారు. ‘‘డబ్బులున్నా సరే తీసుకున్న అప్పును తీర్చడానికి ఇష్టపడని వారు కొందరుంటారు. అలాంటివాళ్లు తీర్చాల్సిందే’’ అని ఆమె చెప్పారు. సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్, ఇతర ఉద్దేశపూర్వక మొండి బకాయిదార్ల నుంచి బకాయిలు రాబట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై స్పం దిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) వల్ల ఇటు బ్యాంకులకు, అటు ప్రజలకు కూడా నిధులు అందుబాటులో లేకుండా పోతాయన్నారు.
ఎగవేతదారుగా యునెటైడ్ బ్రూవరీస్..
కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్కిచ్చిన రుణాలకు సంబంధించి దాని హోల్డింగ్ సంస్థ యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను (యూబీహెచ్ఎల్)ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పీఎన్బీ ప్రకటించింది. ఎస్బీఐ ఇప్పటికే యూబీహెచ్ఎల్తో పాటు మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించడం తెలిసిందే. పీఎన్బీకి కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి రూ.800 కోట్లు రావాల్సి ఉంది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం కింగ్ఫిషర్కు రూ.6,900 కోట్ల పైగా రుణాలిచ్చింది. ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్లను విక్రయించగా కేవలం రూ. 1,100 కోట్లే రికవర్ అయ్యాయి.