గూడెం అంటే బాలోత్సవ్ ..
కొత్తగూడెం అంటే అదే గుర్తుకు వస్తోంది..
ప్రముఖ రచయిత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్
ఘనంగా ‘బాలోత్సవ్–2016’ బ్రోచర్ ఆవిష్కరణ
కొత్తగూడెం అర్బన్ : ‘ఒకప్పుడు బొగ్గు గనులు, కేటీపీఎస్ అంటే కొత్తగూడెం అని గుర్తు. కానీ, ఇప్పుడు బాలోత్సవ్ పేరు చెబితేనే కొత్తగూడెం గుర్తుకు వస్తోంది. అంతాల ఈ కార్యక్రమంల మదిలో నిలిచిపోయింది’ అని ప్రముఖ రచయిత, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. రజతోత్సవం జరుపుకుంటున్న బాలోత్సవ్–2016 బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వాహకుడు వాసిరెడ్డి రమేష్‌బాబు అధ్యక్షతన ఆదివారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా బాలోత్సవ్ బ్రోచర్‌ను ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థిని వర్షిత ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇనాక్ మాట్లాడుతూ ఎవరైతే తన కోసం ఇతరులు తెలుసుకోవాలని అనుకుంటారో.. వారిలో అగ్ని జ్వాల ఏర్పడి వారి లక్ష్య సాధనకు ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే గొప్ప వ్యక్తులవుతారని చెప్పారు. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తయారు కావడానికి ఈ బాలోత్సవ్ ఎంతో ఉపయోగపడుతుందని కితాబునిచ్చారు.
బాలలంటే.. బాలోత్సవ్..
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ కుల, మతాలు, పేద, గొప్ప తేడాలు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు అన్ని వర్గాల వారిని ఏకీకృతం చేస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని, రాష్ట్రంలోని కళారంగ శాఖకు సంబంధించిన వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. సాహిత్యం, సాంస్కృతిక రంగాలు ఎంతో గొప్పవని, వాటికి అంతముండదని, వాటిని విస్మరించే వారికి రోజులుండవని పేర్కొన్నారు.
రజతోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నాం..
బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ చిన్న బిందువుగా మొదలై.. మహా సముద్రంగా బాలోత్సవ్ మారిందని, ఈ ఏడాది 25వ సంవత్సర రజతోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నామన్నారు. 25 సంవత్సరాలుగా బాలోత్సవ్ నిర్వహణకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు, పట్టణ ప్రజలకు ధన్యవాదలు తెలిపారు. బాలోత్సవ్‌లో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా విద్యార్థులు అనేక అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలాల విద్యార్థులు 25 మంది చేత క్లబ్ ఆవరణలో మొక్కలు నాటించారు. ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్ సీతాప్రసాద్ శిష్యబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత, సింగరేణి ఉద్యోగి గుండా రమేష్, జేవీఎస్ చైతన్య కళాశాలల చైర్మన్ జేవీస్.చౌదరి, టీఆర్ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖరరావు, కొదుమసింహం పాండురంగాచార్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.