ఇక్కడే లాగించేస్తున్నారు !
రాష్ట్రంలో భారీగా పెరిగిన మాంసం ఉత్పత్తి.. దారుణంగా తగ్గిన ఎగుమతులు
ఉత్పత్తిలో సగం రాష్ట్రంలోనే వినియోగం
మాంసాహారంవైపే 80 శాతం యువత
మూడేళ్ళ క్రితం వరకూ మాంసం ఎగుమతుల్లో మన రాష్ట్రానిదే మొదటి స్థానం. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. ఐదేళ్ళ క్రితం రూ. 35,100 కోట్ల ఎగుమతులుంటే, గడచిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. 17,400 కోట్లే!! అంటే ఎగుమతులు సగానికి పడిపోయాయి. ఉత్పత్తి పెరిగింది.. ఎగుమతులు మాత్రం తగ్గాయి.. మరి ఉత్పత్తవుతున్న మిగతా మాంసమంతా ఎటుపోతున్నట్టు చెప్మా అంటే.. మనోళ్లే లాగించేస్తున్నారని తేలింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశాబ్దకాలం క్రితం 25.81 కోట్ల కిలోల మాంసం మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ఇది 2011-12 నాటికి 8.24 లక్షల టన్నులకు, 2012-13లో 9.30 లక్షల టన్నులకు చేరింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 10.30 లక్షల టన్నులు దాటుతుందని అంచనా. అంటే పదేళ్ళలోనే మాంసం ఉత్పత్తులు దాదాపు 113 శాతం అంటే.. 75 కోట్ల కిలోల మేర పెరిగాయి. ఇది దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం మాంసంలో ఐదో వంతు.
వాస్తవానికి 1998-2005 మధ్య మాంసం ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండేది. అక్కడ పరిస్థితులు తారుమారవ్వడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కుంచించుకుపోవడం, పారిశ్రామికీకరణ ప్రభావం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం కోళ్ళు, గిత్తలు, దున్నలు, గొర్రెలు, మేకల పెంపకం పెరిగింది. ఫలితంగా శరవేగంగా మాంసం ఉత్పత్తి జరిగింది. దీంతో ఉత్పత్తిలో మన రాష్ట్రమే అగ్రస్థానానికి చేరింది. ఇంత ఉత్పత్తి జరిగినా, ఇది దేశ ఆర్థిక పురోగతిపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదు.
రాష్ట్రంలో మాంసం వినియోగం భారీగా పెరడగమే దీనికి కారణం. ఆధునిక సంప్రదాయ పోకడలు, విదేశీ సంస్కృతి అనుకరణ ఆహార అలవాట్లలో మార్పు తెచ్చింది. ఫలితంగా మాంసాహారుల సంఖ్య పట్టణాలు, నగరాల్లో పెరుగుతోంది. దీంతో ఉత్పత్తయ్యే మాంసంలో అధికశాతం రాష్ట్రంలోనే వినియోగమైపోతోంది. దీంతో ఎగుమతుల్లో మూడేళ్ళ కిందటి వరకు నెంబర్ వన్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉంది.
జోరుగా గొడ్డు మాంస విక్రయాలు: గొడ్డు మాంసం ఎగుమతులు దేశంలో 2001-2002లో 2,40,980 టన్నులు ఉంటే, ఇందులో మన రాష్ట్రం వాటా 10 శాతం. 2009-10 నాటికి 513.668 టన్నులకు చేరినా, మన రాష్ట్రం నుంచి 12 శాతం ఎగుమతులు జరిగాయి. కానీ ఆ తర్వాత కాలంలో క్రమంగా 5 శాతంకు పడిపోయింది. కాగా రాష్ట్రంలో గొడ్డు మాంసం విక్రయ కేంద్రాలు మూడేళ్ళ క్రితం 2 వేలు మాత్రమే ఉంటే, ఇప్పుడు 7వేలకు చేరాయి.
పెరిగిన మాంసం.. తగ్గిన చేపలు
తలసరి మాంసం వినియోగంలోనూ భారీ వ్యత్యాసాలే కన్పిస్తున్నాయి. 2004-05లో 61వ జాతీయ నమూనా సర్వే ప్రకారం గొర్రెలు, మేకల మాంసం తలసరి వినియోగం నెలకు 86 గ్రాములు మాత్రమే. కోడి మాంసం మాత్రం 136 గ్రాములుగా ఉంది. ఇదిప్పుడు మూడు రెట్లు పెరిగినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. చేపల తలసరి వినియోగం మాత్రం బాగా తగ్గింది. నెలకు 71 గ్రాములే తింటున్నట్టు సర్వే తేల్చింది. ఉరుకులు, పరుగుల పట్టణీకరణలో చేపలను వండుకోవడం కష్టంగా ఉంది. దీనికి తోడు రవాణా ఖర్చుల పెరుగుదల చేపల అమ్మకాలపై పడింది.
గత పదేళ్ల గణాంకాలు..
40 శాతం
పెరిగిన మాంసాహార హోటళ్ళు
60 శాతం
పెరిగిన బిర్యానీ అమ్మకాలు
20 శాతం
శాఖాహారం వైపు మళ్లిన వృద్ధులు
80 శాతం
నాన్-వెజ్ వైపు మొగ్గుతున్న యువత
176
అనుమతి ఉన్న కబేళాల సంఖ్య
580
పనిచేస్తున్న కబేళాలు