రియో ఒలింపిక్ పతకం వేలానికి పెట్టాడు!
ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంటే చిన్న విషయం కాదు. క్రీడాకారుల జీవితంలో చాలా అరుదుగా సాధించే విజయం అది. అలాంటి పతకాన్ని చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ, నిన్న కాక మొన్న ముగిసిన రియో ఒలింపిక్స్‌లో తాను సాధించిన రజత పతకాన్ని అప్పుడే వేలానికి పెట్టేశాడో క్రీడాకారుడు. అవును.. పోలండ్‌కు చెందిన డిస్కస్ త్రో క్రీడాకారుడు పియోటర్ మలచోవ్‌స్కీ తాను రియోలో సాధించిన పతకాన్ని వేలానికి పెట్టాడు. కేన్సర్‌తో బాధపడుతున్న మూడేళ్ల అబ్బాయికి చికిత్స చేయించడం కోసం అతడీ పని చేశాడు. ఒలెక్ అనే చిన్నారి.. రెండేళ్లుగా కంటి కేన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడికి న్యూయార్క్ ఆస్పత్రిలో చికిత్స చేయించడం ఒక్కటే మార్గమని అన్నారు.
నిజానికి తాను రియోలో స్వర్ణపతకం సాధించాలనే చాలా ప్రయత్నించానని, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ అంతకంటే విలువైన వాటికోసం పోరాడాలని పిలుపునిస్తున్నానని మలచోవ్‌స్కీ తన ఫేస్బుక్ పేజిలో రాశాడు. ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తే, తన రజత పతకం ఒలెక్‌కు బంగారం కంటే చాలా విలువైనది అవుతుందని చెబుతూ తన పతకాన్ని వేలానికి పెడుతున్నట్లు చెప్పాడు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును తాను అతడి చికిత్సకే వెచ్చిస్తానన్నాడు. అది వేలంలో ఎంతకు పోయిందో తెలియదు గానీ.. తర్వాత మాత్రం 'సక్సెస్' అని తన ఫేస్బుక్ పేజీలో రాశాడు. అంటే, ఆ చిన్నారికి చికిత్సకు కావల్సిన మొత్తం వచ్చిందనే అనుకోవాలి.