కార్మికుడి దారుణ హత్య
♦ బండరాయితో మోది చంపిన దుండగులు
♦ మేడ్చల్ పారిశ్రామికవాడలో ఘటన
♦ క్లూస్ టీం, జాగిలాలతో పరిశీలించిన పోలీసులు
♦ హతుడు జార్ఖండ్‌వాసి
మేడ్చల్: మేడ్చల్ పారిశ్రామికవాడలో ఓ కార్మికుడు దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని బండరాళ్లతో మోది చంపేశారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రుబీ కుల్వ (28) గత నాలుగు సంవత్సరాల నుంచి మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో ఉన్న పారిశ్రామిక వాడలోని సర్వోత్తమ్ కంపెనీలో కూలీపనులు చేసుకుంటూ అక్కడే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్లిన రుబీ కుల్వ తిరిగి రాలేదు. గురువారం తెల్లవారుజామున పారిశ్రామిక వాడ సమీపంలోని మినీస్టేడియం వద్ద గుర్తు తెలియని దుండగులు రుబీ కుల్వ తలపై బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు.
విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను వివరాలు సేకరించారు. పోలీసు జాగిలాలు హత్య జరిగిన ప్రదేశం నుంచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో తిరగడంతో తోటి కార్మికులే రుబీ కుల్వను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్య విషయం తెలుసుకున్న స్థానికులు, కార్మికులు సంఘటన స్థలంలో పెద్దఎత్తున గుమిగూడారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.