పునరావాస కేంద్రం వద్ద పేలుడు: నలుగురు మృతి
కోలంబియా మెడిల్లెన్ నగరంలో పునరావాస కేంద్రం వద్ద శనివారం బాంబు పేలుడు సంభవించింది.నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు పోలీసులు ఉన్నారు.బాంబు పేలుడును కోలంబియా పోలీసు డైరెక్టర్ ఖండించారు.ఆ పేలుడుకు బాధ్యులైన వారిపై సమాచారం అందిస్తే రూ.10 వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు.
పునరావాస కేంద్రం తలుపు వద్ద బాంబును ఉంచి సెల్ ఫోన్ ద్వారా పేలుడుకు పాల్పడ్డారని పోలీసు డైరెక్టర్ తెలిపారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కోలంబియాలో డ్రగ్స్ బారిన పడిన వేలాది మంది ఆ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
డ్రగ్స్ బారిన పడినవారికి చికిత్స అందించడంపై డ్రగ్స్ ముఠాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దాంతో పేలుడుపై డ్రగ్స్ ముఠాల హస్తం ఉండవచ్చని తాము అనుమానిస్తున్నామని కోలంబియా పోలీసు డైరెక్టర్ వెల్లడించారు. ఆ కోణంలో దర్యాప్తు జరుగుతుందన్నారు.