వడియాలతో ధ్యాన గణపతి
కడప కల్చరల్:
కడప నగరానికి చెందిన యువకుడు వంకదార రాము ప్రతి వినాయక చవితికి తన సృజనను చూపుతూ ఏడాదికి ఒక రకం వస్తువులతో గణపతి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అలాగే ఈ ఏడాది కూడా తన బుర్రకు పదునుపెట్టి వడియాలతో గణపతిని రూపొందించారు. నిజానికి ఆ వీధికి ఊరగాయల (వడియాల) వీధిగా నగరంలో పేరుంది. తమ వీధిలో లభించే వస్తువులతో ఆయన మరో ఏడుగురు స్నేహితులతో కలిసి శ్రీ చక్రాలను పోలిన వడియాలతో పద్మంలో కూర్చొన్న «12 అడుగుల ధ్యాన గణపతిని తయారు చేశారు. వెదురు దెబ్బలు, తడికెలు, కాగితం గుజ్జుతో చేసిన గణపతికి మైదాతో వడియాలను అంటించారు. పర్యావరణానికి హాని చేయని ఈ విగ్రహం తయారీకి రూ. 48 వేలు ఖర్చయిందని రాము తెలిపారు. ఈ విగ్రహానికి పూలమాలలకు బదులుగా 20 వేల పానీపూరీలతో అలంకారం చేయనున్నారు.