ఆభరణాలు చోరీ చేసిన వర్కర్ అరెస్ట్
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మీనాక్షి జ్యువెల్లర్స్లో యజమాని కళ్లుగప్పి అక్కడ పని చేస్తున్న వ్యక్తి లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు తస్కరించి పరారీలో ఉన్న నిందితుడిని క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ చోరీ ఘటనను క్రైం పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే రోడ నెం. 12లో మీనాక్షి జ్యువెల్లరీస్ డిజైనర్ ఆభరణాల షోరూం ఉంది. 2014 డిసెంబర్ 6వ తేదీన ఈ ఆభరణాల షోరూంలో డిజైనర్ ఆభరణాలను తయారు చేసే వెస్ట్బెంగాల్కు చెందిన బలరాం సామంత (30) యజమాని ఇచ్చిన ఆభరణాలతో ఉడాయించాడు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుంది. జ్యువెల్లర్స్ షోరూం యజమాని నితిన్ అగర్వాల్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నిందితుడు దొరకని కారణంగా ఈ కేసును మూసేశారు. నిందితుడి వివరాలు కొంత వరకు తెలియడంతో ఫిర్యాదుదారు ఈ కేసును మళ్లీ తెరిపించాడు. పశ్చిమబెంగాల్లో తిష్టవేసిన బలరాం సామంతను ఇటీవలనే అదుపులోకి తీసుకొని హుగ్లి కోర్టులో ప్రవేశ పెట్టి ట్రాన్సిట్వారెంట్ మీద నగరానికి తీసుకొచ్చి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు చోరీ చేసిన ఆభరణాలను అక్కడే విక్రయించగా కొనుగోలుదారిడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడిని మరోమారు కస్టడీలోకి తీసుకుంటే ఆభరణాలు రికవరీ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.