‘స్పేస్ టికెట్’ వివాదం కేసులో ఓడిన భర్త
లండన్: ‘స్పేస్ టికెట్’వివాదంతో కోర్టుకెక్కిన భారత సంతతికి చెందిన ఓ జంట విడాకుల కేసులో భర్త ఆశిష్ ఠక్కర్ ఓడిపోయారు. ఆశిష్ తన భార్య మీరా మానెక్‌కి తగిన భరణాన్ని ఇవ్వాల్సిందేనని ఇంగ్లండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. తనకు రావాల్సిన భరణం చెల్లించకుండా ఉండేందుకు తన భర్త ఆశిష్ ఆస్తులను తక్కువగా చేసి చూపిస్తున్నారని మీరా బ్రిటన్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
2008లో వివాహం చేసుకున్న వీళ్లు 2013లో విడిపోయారు. ఆశిష్ బిలియనీర్ అని, తన ఆస్తిని కేవలం 4.45 లక్షల పౌండ్లుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఆశిష్ 1.6 లక్షల పౌండ్లతో వర్జీనియా గలాక్టివ్ పేరుతో స్పేస్ టికెట్‌ను కూడా కొనుగోలు చేశారని, ఈ ధరను తన ఆస్తిలో కలపలేదని కోర్టుకు తెలిపింది. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. కాగా, మారా గ్రూపు ఆశిష్‌కి సంబంధించింది కాదని ఆశిష్ తరఫున అతని తండ్రి, సోదరి హైకోర్టుకు నివేదించగా.. ఈ వాదనలను తోసిపుచ్చింది.