నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
కరీంనగర్‌అర్బన్, న్యూస్‌లైన్ : నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డీటీసీ మీరాప్రసాద్ అన్నారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారని, వాహనదారులు, డ్రైవర్లు రహదారి నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని డీటీసీ పేర్కొన్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 25వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఆర్ట్స్ కళాశాల, తెలంగాణ చౌక్, బస్టాండ్ మీదుగా కళాభారతి వరకు ర్యాలీ తీశారు. మద్యం తాగి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి చేయవద్దని సూచించారు. సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వేణు, కిషన్‌రావు, లింగమూర్తి, ఏఎంవీఐలు కవిత, చంద్రశేఖర్, యుగేశ్‌సింగ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.