ఉపాధ్యాయ సమస్యలపై దశలవారీ పోరాటాలు
ఏలూరు సిటీ: రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఫ్యాప్టో నాయకత్వానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు దశలవారీ పోరాటాలకు సిద్ధపడుతున్నట్టు ఫ్యాప్టో నాయకులు స్పష్టం చేశారు. స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఈ నెల 30, 31 తేదీల్లో తాలూకా కేంద్రాల్లో, ఫిబ్రవరి 13న జిల్లా కేంద్రంలో, 27న విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శిని నియమించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు సాధించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డీవైఈవో, డైట్ లెక్చరర్స్, జేఎల్ పోస్టులలో అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ టీచర్లకు సర్వీసు కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, సర్ప్లస్ ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డీఎస్ఈ నిర్వహించాలని, ఎయిడెడ్ టీచర్లకు పదోన్నతులు, ఆరోగ్యకార్డులు మంజూరు చేయాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌ను సవరించి జీపీఎఫ్, ఎల్టీసీ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉర్దూ మీడియం స్కూళ్లలో జరిగే పరీక్షలకు ఉర్దూ మీడియంలోనే ప్రశ్నపత్రాలు సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఈడే శివశంకర్, డి.లింగేశ్వరరావు, జి.సాయిశ్రీనివాస్, కేవీ అప్పారావు, సీహెచ్ అనిల్‌బాబు, ఎండీ జిక్రియ పాల్గొన్నారు.