అరచేతిలో... ఎర్ర మందారాలు!
డిజైన్
ఆషాఢం అతివలకు చాలా ఇష్టమైన మాసం. గోరింటాకుతో ఎర్రగా పండిన అరచేతులను చూసుకుని మురిసిపోతుంటారు. రకరకాల డిజైన్ల కోసం మెహెందీ కోన్స్ వాడకం పెరిగిన ఈ రోజుల్లో కోన్స్ నాణ్యతనూ పరీక్షించి ఎంచుకోవాలి. మెహెందీ కోన్స్‌తో చేతులు, పాదాలపై అందంగా వేసుకున్న డిజైన్లు ఎరుపుదనం నింపుకోవాలంటే...
మెహెందీ డిజైన్‌ను తీర్చిదిద్దిన 5 నిమిషాలకు చిక్కని నిమ్మరసం, పంచదార సిరప్‌లో దూది ఉండను ముంచి, ఆరిన మెహెందీ డిజైన్‌పై అద్దాలి. దీంతో డిజైన్ రంగు తేలుతుంది.
చాలామంది గోరింటాకు, పొడితో వేసుకున్న డిజైన్లు రాత్రిమొత్తం ఉంచేస్తుంటారు. డిజైన్ ఎరుపురంగులోకి మారడానికి 4 నుంచి 6 గంటలు సమయం సరిపోతుంది.
మెహెందీ డిజైన్ పొడిబారాక నీళ్లతో కడగకుండా, కేవలం పై పొరను బ్రష్‌తో తొలగించి, నూనె రాసుకోవాలి.
పండిన చేతులను శుభ్రపరుచుకోవడానికి కనీసం 24 గంటల వరకు సబ్బును ఉపయోగించకూడదు. అలా చేస్తే డిజైన్ త్వరగా పోదు.