ఆడాళ్ల కంటే.. మగాళ్ల ఆత్మహత్యలే అధికం
ఉద్యోగం పోయిందనో, ప్రేమించిన మహిళ నిరాకరించిందనో.. ఇలా కారణాలేవైనా మన దేశంలో ఆత్మహత్యలు మాత్రం చాలా ఎక్కువ. అందులోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయం జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలో స్పష్టంగా తేలింది. 2013 సంవత్సరంలో మొత్తం 1.34 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోగా వాళ్లలో 64,098 మంది పురుషులు ఉంటే మహిళలు కేవలం 29,491 మంది ఉన్నారు. ఈ నిష్పత్తి చూస్తే.. 67.2: 32.8 చొప్పున ఉంది. 2012 సంవత్సరంలో ఈ నిష్పత్తి 66.2:33.8గా ఉండేది.
మన దేశంలో గంటకు 15 ఆత్మహత్యల చొప్పున జరుగుతున్నాయి. అయితే మొత్తం 48.6 శాతం కేసులకు కారణాలేంటో తెలియట్లేదు. మిగిలినవాళ్లు మాత్రమే తమ చావుకు కారణం ఫలానా అని సూసైడ్ నోట్ రాసి పెడుతున్నారు. ఇలా కారణాలు తెలియనప్పుడు ఆత్మహత్యలను నివారించడం కష్టం అవుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమస్యలే ప్రధానంగా ఆత్మహత్యలకు ఎక్కువ కారణం అవుతున్నాయి. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఒకేసారి కాకుండా ముందు పదిసార్లు ప్రయత్నించి, ఆ తర్వాతే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.