mepma officers
-
నా దేవుడిక లేడయ్యా?
అనంతపురం న్యూసిటీ: నగర శివారులోని శిల్పారామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా అకౌంట్స్ అధికారి సుంకు కృష్ణమూర్తి (56) దుర్మరణం చెందారు. అడిషనల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి తన పదవీ కాలంలో జరిగిన నాలుగేళ్ల అభివృద్ధిపై ‘అనంత ప్రగతి– ఆత్మీయ సభ’ పేరిట బుధవారం శిల్పారామంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, మెప్మా అకౌంట్స్ ఆఫీసర్ సుంకు కృష్ణమూర్తి ద్విచక్రవాహనంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇస్కాన్ మందిరం మీదుగా శిల్పారామం బయల్దేరారు. ఫ్లై ఓవర్‌పై యూటర్న్ తీసుకుంటుండగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కొబ్బరి నూనె లోడుతో వెళుతున్న లారీ వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుంకు కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న పగడాల కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ మునిస్వామికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. అటు నుంచి పగడాల కృష్ణమూర్తిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పలువురి పరామర్శ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత అనంత చంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మార్చురీలో సుంకు కృష్ణమూర్తి మృతదేహానికి నివాళులర్పించారు. అనంత చంద్రారెడ్డి మాట్లాడు తూ కృష్ణమూర్తి తన క్లాస్మేట్ అని, మంచి మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, కార్పొరేటర్ జానకి పాల్గొన్నారు. మంచి వ్యక్తిని కోల్పోయాం మెప్మా అకౌంట్స్ ఆఫీసర్ ఎస్.కృష్ణమూర్తి మృతి బాధాకరమని, మంచి వ్యక్తిని కోల్పోయామని మేయర్ స్వరూప, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మెప్మా పీడీ సావిత్రి పేర్కొన్నారు. ఆస్పత్రిలో మృతదేహాన్ని వారు సందర్శించి, నివాళులర్పించారు. నా దేవుడిక లేడయ్యా? ‘అయ్యో భగవంతుడా ఎంత పని చేశావయ్యా. నా ఇంటి దేవున్ని తీసుకొని వెళ్తివే. ఏం పాపం చేశామయ్యా..అయ్యో ఎంత ఘోరం జరిగిందే. నా దేవుడిక లేడు’ అంటూ సుంకు కృష్ణమూర్తి మృతదేహంపై పడి సతీమణి పద్మావతి బోరున విలపించింది. మెప్మా పీడీ సావిత్రి, తోటి ఉద్యోగులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. సుంకు కృష్ణమూర్తి దంపతులకు సాయి మనోజ్, సాయి చరణ్ ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రాణాలు పోయినా లెక్కలేదా? ‘అనంత ప్రగతి – ఆత్మీయ సభ’కు నగరంతోపాటు రూరల్ ప్రాంతం నుంచి వేలాదిమందిని తీసుకొచ్చేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. అయితే ఫ్లై ఓవర్‌పై వాహనాలకు మార్గదర్శనం చేసేందుకు పోలీసులను ఏర్పాటు చేయలేదు. ట్రాఫిక్ విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్లే మెప్మా అధికారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడని పలువురు చర్చించుకుంటున్నారు. నగరంలోనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని మరికొంతమంది గుసగుసలాడారు. ప్రమాదంలో మెప్మా అధికారి మృతి చెందినా, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గాయపడినా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ‘అనంత ప్రగతి – ఆత్మీయ సభ’ను కొనసాగించడం విమర్శలకు దారి తీసింది. -
కదులుతున్న డొంక !
ఆర్మూర్: పట్టణంలో మహిళా సంఘాల నుంచి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగుల బలవంతపు వసూళ్ల కూపీ లాగితే జిల్లా కేంద్రంలోని పీడీ కార్యాలయం డొంక కదులుతోంది. నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక ఉద్యోగులను నియమించిన తీరు, వారిపై ముడుపుల ఆరోపణలు వచ్చినా స్పందించని ఉన్నతాధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు మహిళ సాధికారతకు పెద్ద పీట వేస్తూ పావళా వడ్డీ, వడ్డీ లేని బ్యాంకు రుణాలు అందిస్తుంటే మరో వైపు మెప్మాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులు తమ జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారు. మహిళా సంఘాల వారిని ముడుపుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారు. వక్రమార్గాలను ఎన్నుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం ఆర్మూర్‌లో మెప్మా పరిధిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో) నియామకం, మహిళా సంఘాల నుంచి సీవో చేపడుతున్న బలవంతపు వసూళ్లు. సదరు సీవో గతంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో విధులు నిర్వహించేవారు. మెప్మా పీడీగా మధుకర్ బాబు విధులు నిర్వహిస్తున్న సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు రుజువు కావడం తో సీవోను ఉద్యోగం నుంచి తొలగించారు. పలు వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను మెప్మా ఉన్నతాధికారులు ఆర్మూర్‌లో మళ్లీ సీవోగా నియమిస్తూ ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ వ్యవహారంలో లక్ష రూపాయలు చేతులు మారినట్లు ఆరోపలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సీవోగా చేరిన ఆమో విద్యార్హత సర్టిఫికెట్లలోనూ సైతం గందరగోళం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిక్కిం యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నతాధికారులను మేనేజ్ చేసి ఆర్మూర్‌లో రీఎంట్రీ ఇచ్చినట్లు జిల్లా కేంద్రంలోని పీడీ కార్యాలయంలో చెప్పుకుంటున్నారు. మరో వైపు పట్టణంలోని మహిళా సంఘాలతో మమేకమై వారికి బ్యాంకు రుణాలు ఇప్పించడంలో, స్వయం ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పించాల్సిన సమయంలో క్రియాశీల బాధ్యతలు నిర్వహించే సీవో పోస్టుకు స్థానికులను మాత్రమే నియమించాలనే నిబంధన సైతం ఉంది. ఇక్కడ ఆ నిబంధనలను తుంగలో తొక్కేసారు. సీవో పోస్టుకు అర్హులైన నిరుద్యోగులు ఆర్మూర్‌లో ఎందరో ఉన్నా వారందరినీ కాదని జిల్లా కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగిణిని ఆర్మూర్‌కు పంపించారు. ఇంతకముందు జిల్లా కేంద్రంలో కొనసాగిన తంతు ఇక్కడా కూడా అమలైంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు ఇప్పించే సమయంలో ఆర్పీలు డాక్యుమెంటేషన్ చేస్తే సీవో ఆ డాక్యుమెంట్ల ను పరిశీలించి బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పిం చాల్సి ఉంటుంది. అందుకు మెప్మా నుంచి సీవోకు వేతనం సైతం అందుతుంది. కాని ఇలా రుణాలు ఇప్పించిన సమయంలో మహిళా సంఘాల వారు సంతోషంగా ఆర్పీలకు, సీవోకు కొంత మొత్తాన్ని ఇస్తుంటారు. అంత వరకు సమస్య లేదు. కాని ఆ సీవో ఆర్మూర్‌కు వచ్చిన నాటి నుంచి ఆర్పీల సహకారంతో బలవంతపు వసూళ్లకు తెరలేపారు. ఈ బలవంతపు వసూళ్లకు ఆర్పీలు సైతం తోడు కావడంతో మహిళా సంఘాల వారిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. మహిళా సంఘాల వారు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన సమయంలో వారికి ప్రభుత్వాలు చెపుతున్న పావళా వడ్డీ, వడ్డీ లేని రుణాలను వర్తింపజేయాలంటే ఈ ఆర్పీలు, సీవోలే కంప్యూటర్ సహకారంతో ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. అలా పొందుపర్చిన సంఘాల వారికే వడ్డీ మాఫీ వర్తిస్తుంది. అప్పటి వరకు సంఘాల వారు చెల్లించిన వడ్డీని బ్యాంకర్లు తిరిగి మహిళా సంఘాల అకౌంట్లలో జమ చేస్తారు. దీనిని మెప్మా ఉద్యోగులు బెదిరింపులకు దిగడానికి అవకాశంగా మల్చుకున్నారు. సీవో, ఆర్పీలు అడిగిన ముడుపులు ఇవ్వకపోతే ఎక్కడ తమ సంఘం వడ్డీ మాఫీ అర్హతకు నోచుకోదో అనే భయంతో మహిళా సంఘాల సభ్యులు వా రు అడిగినంత మొత్తం చెల్లించారు. ఈ వ్యవహారం కాస్త ‘సాక్షి’ దినపత్రికలో వరస కథకాలు ప్రచురితం కావడంతో కొందరు ఆర్పీలు తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేశారు. సీవో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించకపోగా, నిబంధనలకు విరుద్ధంగా ఆర్మూర్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఉన్నతాధికారుల అండ లభిస్తోంది. దీంతో ఈ వసూళ్లలో ఎవరి వాటా ఎంతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ స్వయంగా కలగజేసుకొని పూర్తి స్థాయి విచారణ జరిపితే గాని మెప్మాలో జరుగుతున్న అక్రమాల బాగోతం వెలుగు చూసే అవకాశం లేదు.