ఆర్మూర్: పట్టణంలో మహిళా సంఘాల నుంచి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగుల బలవంతపు వసూళ్ల కూపీ లాగితే జిల్లా కేంద్రంలోని పీడీ కార్యాలయం డొంక కదులుతోంది. నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక ఉద్యోగులను నియమించిన తీరు, వారిపై ముడుపుల ఆరోపణలు వచ్చినా స్పందించని ఉన్నతాధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు మహిళ సాధికారతకు పెద్ద పీట వేస్తూ పావళా వడ్డీ, వడ్డీ లేని బ్యాంకు రుణాలు అందిస్తుంటే మరో వైపు మెప్మాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులు తమ జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారు. మహిళా సంఘాల వారిని ముడుపుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారు. వక్రమార్గాలను ఎన్నుకుంటున్నారు.
ఇందుకు నిదర్శనం ఆర్మూర్‌లో మెప్మా పరిధిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో) నియామకం, మహిళా సంఘాల నుంచి సీవో చేపడుతున్న బలవంతపు వసూళ్లు. సదరు సీవో గతంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో విధులు నిర్వహించేవారు. మెప్మా పీడీగా మధుకర్ బాబు విధులు నిర్వహిస్తున్న సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు రుజువు కావడం తో సీవోను ఉద్యోగం నుంచి తొలగించారు. పలు వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను మెప్మా ఉన్నతాధికారులు ఆర్మూర్‌లో మళ్లీ సీవోగా నియమిస్తూ ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ వ్యవహారంలో లక్ష రూపాయలు చేతులు మారినట్లు ఆరోపలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సీవోగా చేరిన ఆమో విద్యార్హత సర్టిఫికెట్లలోనూ సైతం గందరగోళం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
సిక్కిం యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నతాధికారులను మేనేజ్ చేసి ఆర్మూర్‌లో రీఎంట్రీ ఇచ్చినట్లు జిల్లా కేంద్రంలోని పీడీ కార్యాలయంలో చెప్పుకుంటున్నారు. మరో వైపు పట్టణంలోని మహిళా సంఘాలతో మమేకమై వారికి బ్యాంకు రుణాలు ఇప్పించడంలో, స్వయం ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పించాల్సిన సమయంలో క్రియాశీల బాధ్యతలు నిర్వహించే సీవో పోస్టుకు స్థానికులను మాత్రమే నియమించాలనే నిబంధన సైతం ఉంది. ఇక్కడ ఆ నిబంధనలను తుంగలో తొక్కేసారు. సీవో పోస్టుకు అర్హులైన నిరుద్యోగులు ఆర్మూర్‌లో ఎందరో ఉన్నా వారందరినీ కాదని జిల్లా కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగిణిని ఆర్మూర్‌కు పంపించారు.
ఇంతకముందు జిల్లా కేంద్రంలో కొనసాగిన తంతు ఇక్కడా కూడా అమలైంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు ఇప్పించే సమయంలో ఆర్పీలు డాక్యుమెంటేషన్ చేస్తే సీవో ఆ డాక్యుమెంట్ల ను పరిశీలించి బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పిం చాల్సి ఉంటుంది. అందుకు మెప్మా నుంచి సీవోకు వేతనం సైతం అందుతుంది. కాని ఇలా రుణాలు ఇప్పించిన సమయంలో మహిళా సంఘాల వారు సంతోషంగా ఆర్పీలకు, సీవోకు కొంత మొత్తాన్ని ఇస్తుంటారు. అంత వరకు సమస్య లేదు. కాని ఆ సీవో ఆర్మూర్‌కు వచ్చిన నాటి నుంచి ఆర్పీల సహకారంతో బలవంతపు వసూళ్లకు తెరలేపారు. ఈ బలవంతపు వసూళ్లకు ఆర్పీలు సైతం తోడు కావడంతో మహిళా సంఘాల వారిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడ్డారు.
మహిళా సంఘాల వారు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన సమయంలో వారికి ప్రభుత్వాలు చెపుతున్న పావళా వడ్డీ, వడ్డీ లేని రుణాలను వర్తింపజేయాలంటే ఈ ఆర్పీలు, సీవోలే కంప్యూటర్ సహకారంతో ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అలా పొందుపర్చిన సంఘాల వారికే వడ్డీ మాఫీ వర్తిస్తుంది. అప్పటి వరకు సంఘాల వారు చెల్లించిన వడ్డీని బ్యాంకర్లు తిరిగి మహిళా సంఘాల అకౌంట్లలో జమ చేస్తారు. దీనిని మెప్మా ఉద్యోగులు బెదిరింపులకు దిగడానికి అవకాశంగా మల్చుకున్నారు. సీవో, ఆర్పీలు అడిగిన ముడుపులు ఇవ్వకపోతే ఎక్కడ తమ సంఘం వడ్డీ మాఫీ అర్హతకు నోచుకోదో అనే భయంతో మహిళా సంఘాల సభ్యులు వా రు అడిగినంత మొత్తం చెల్లించారు. ఈ వ్యవహారం కాస్త ‘సాక్షి’ దినపత్రికలో వరస కథకాలు ప్రచురితం కావడంతో కొందరు ఆర్పీలు తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేశారు. సీవో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించకపోగా, నిబంధనలకు విరుద్ధంగా ఆర్మూర్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఉన్నతాధికారుల అండ లభిస్తోంది. దీంతో ఈ వసూళ్లలో ఎవరి వాటా ఎంతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ స్వయంగా కలగజేసుకొని పూర్తి స్థాయి విచారణ జరిపితే గాని మెప్మాలో జరుగుతున్న అక్రమాల బాగోతం వెలుగు చూసే అవకాశం లేదు.
కదులుతున్న డొంక !
Published Sun, Jan 11 2015 10:27 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement