women societies
-
Kurnool: అమూల్ ఆధ్వర్యంలో పాలసేకరణ.. పాడి రైతుకు పండగ
రైతు ఇంట పాడిని అభివృద్ధి చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ను రంగంలోకి దించుతోంది. సెప్టెంబర్ నుంచి జిల్లాలో పాలసేకరణ కొనసాగనుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దీంతో పోటీతత్వం పెరిగి పాడి రైతుకు మేలు చేకూరనుంది. పాలకు మెరుగైన ధర లభించనుంది. సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాల్లో పాడి గేదెలు 59,690, పాడి ఆవులు 68,120 ఉన్నాయి. పచ్చిమేత పుష్కలంగా ఉండే సమయంలో రోజుకు 5.5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం గేదెపాలకు వెన్న శాతాన్ని బట్టి లీటరుకు గరిష్టంగా రూ.67 వరకు ధర లభిస్తోంది. ఆవు పాలను గరిష్టంగా లీటరుకు రూ.32 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. పాల కొలతలు, వెన్నశాతం నిర్ధారణలో రైతులను దగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమూల్ వస్తే రైతులకు వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.77.98 ధర లభించే అవకాశం ఉంది. ఆర్బీకేల పక్కనే బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు అమూల్ ద్వారా సెప్టెంబర్ నెల నుంచి పాల సేకరణ చేపట్టనున్నారు. రైతు భరోసా కేంద్రాల వారీగా 2000 లీటర్ల సామర్థ్యంతో బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాల ఉత్పత్తి ఉన్న 199 ఆర్బీకేల సమీపంలోనే వీటి ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్థలాలు సేకరిస్తోంది. ఒక్కోదానికి ఐదు సెంట్ల స్థలం అవసరం కాగా, ఇప్పటికే 198 పాలశీతలీకరణ కేంద్రాలకు రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 47 భవనాలు కూడా నిర్మిస్తున్నారు. ఇవిగాక గ్రామాల్లో 200 లీటర్ల సామర్థ్యంతో 200కుపైగా పాల సేకరణ కేంద్రాలు(అటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు) కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి 3.50 సెంట్ల స్థలం అవసరం కాగా, 168 పాలసేకరణ కేంద్రాల కోసం రెవెన్యూ అధికారులు అవసరమైన స్థలాలను సేకరించారు. వీటిలో అమూల్ సిబ్బంది ఉండి, సేకరించిన పాలను బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా అమూల్ డెయిరీకి పాలు సరఫరా అవుతాయి. ట్యాంకర్లు వెళ్లడానికి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు రూట్లను కూడా సిద్ధం చేశారు. మహిళా సొసైటీల ఏర్పాటు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో 3.25 లక్షల మంది వరకు మహిళలు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది పాడిపై ఆధారపడి ఉన్నారు. పాలు ఉత్పత్తి చేసే మహిళలతో ఉమెన్ డెయిరీ డెవలప్మెంటు సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. వీటిని కో–ఆపరేటివ్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. అమూల్ పాల సేకరణలో డీఆర్డీఏ, పశుసంవర్ధకశాఖ, సహకార శాఖ భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పటికే సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ అయిన వెంకటకృష్ణను ప్రభుత్వం జిల్లా డెయిరీ డెవలప్మెంట్ అధికారిగా నియమించింది. ఉమన్ డెయిరీ డెవలప్మెంట్ సహకార చట్టం కింద సొసైటీలను రిజిస్ట్రేషన్ చేస్తారు. రోజుకు ఎన్ని లీటర్లు ఉత్పత్తి అవుతున్నాయనే వాటిని పర్యవేక్షిస్తారు. ఎన్నో ప్రయోజనాలు మాకు పది పాడి గేదెలు ఉన్నాయి. పచ్చిమేత పుష్కలంగా లభించే సమయంలో రోజుకు 35 లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. గతంలో ఒక డెయిరీకి పాలుపోసే వాళ్లం. లీటరుకు గరిష్టంగా రూ.45 వరకే ధర లభించేది. ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో ప్రస్తుతం పిండిన పాలు పిండినట్లు హోటళ్లకు పోస్తున్నాం. లీటరుకు రూ. 55 ప్రకారం ధర ఇస్తున్నారు. అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ చేపడితే పాడిరైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. మా గ్రామంలో కూడా బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. – రసూల్, టి.గోకులపాడు, కృష్ణగిరి మండలం పాడి రైతులకు మంచి రోజులు వస్తున్నాయి మాకు గ్రేడెడ్ ముర్రా గేదెలు4, ఆవులు మూడు ఉన్నాయి. రోజు సమతుల్యత కలిగినదాణా, పచ్చిమేత ఇస్తుంటాం. రోజుకు 45 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతాయి. పాడిమీద కష్టపడుతున్నా, తగిన గిట్టుబాటు ధర లభించడం లేదు. అమూల్ పాల సేకరణ మొదలైతేనే పాడిరైతుకు మంచి రోజులు వచ్చినట్లు అవుతుంది. గిట్టుబాటు ధరలు లభిస్తాయనే నమ్మకం ఉంది. – ఖాజావలి, గూడూరు గిట్టుబాటు ధర లభిస్తుంది సెప్టెంబరు నుంచి జిల్లాలో అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఉపాధి నిధులతో పాలశీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ చేపడితే పోటీతత్వం పెరిగి రైతుకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. – డాక్టర్ రామచంద్రయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
ఇదిగోనమ్మా.. రుణం తీసుకో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ పథకం కింద ఇచ్చే రుణాల మంజూరు లక్ష్యాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి సుమారు 32 శాతం అధిక మొత్తంలో రుణాలివ్వాలని నిర్ణయించింది. నిర్దేశించిన లక్ష్యం భారీగా ఉండటంతో మహిళా సంఘాలకు రుణాలిప్పించేందుకు క్షేత్రస్థాయిలోని ఐకేపీ సిబ్బంది తంటాలు పడుతున్నారు. ‘రుణం తీసుకోండమ్మా..’ అంటూ స్వయం సహాయక సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణాలు మంజూరు చేస్తోంది. సీసీఎల్ లోన్లు, టర్మ్ లోన్లు ఇలా రెండు రకాల రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తారు. ఆయా సంఘాలు ప్రతినెలా పొదుపు చేసుకుని.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించిన సంఘాలకు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష వరకు రుణం రుణ మంజూరు లక్ష్యం భారీగా పెరగడంతో ఒక్కో సభ్యురాలికి సుమారు లక్ష రూపాయల వరకు రుణం మంజూరవుతోంది. గతంలో రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అంతకు రెట్టింపు పెంచారు. దీంతో మహిళలు ఉత్సాహంగా రుణాలు తీసుకుంటున్నా.. తిరిగి చెల్లింపు విషయంలో ఒకింత ఆందోళన చెందుతున్నారు. పెద్ద మొత్తంలో రుణం తీసుకుని చెల్లించకపోతే, రానున్న రోజుల్లో రుణానికి అర్హత కోల్పోతామని భావిస్తున్నారు. రుణాల ఊబిలో కూరుకుపోతే ఇబ్బందిపడాల్సి వస్తుందని కలవరం చెందుతున్నారు. టంచనుగా రీపేమెంట్ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలు టంచనుగా వసూలవుతున్నాయి. రికవరీ రేటు 98 శాతం వరకు ఉండటంతో బ్యాంకర్లు పెద్దగా తిరకాసు పెట్టకుండానే రుణాలిచ్చేస్తున్నారు. ఏదైనా కారణంతో సంఘంలోని ఒక మహిళ తన రుణాన్ని తిరిగి చెల్లించకుంటే సంఘంలోని మిగితా సభ్యులే చెల్లించి, ఆ మొత్తాన్ని తర్వాత వసూలు చేసుకుంటున్నారు. దీంతో రుణాలపై రీపేమెంట్ ఇబ్బందులు లేకుండా పోయాయి. కరోనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు.. కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. లాక్‌డౌన్‌తో పలువురు ఉపాధి కోల్పోయారు. ఇలాంటి తరుణంలో మహిళల కొనుగోలు శక్తిని పెంచేందుకు రుణ మంజూరు లక్ష్యాన్ని ప్రభుత్వం పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర కీలకం కావడంతో వారికి విరివిగా రుణాలివ్వడం ద్వారా గ్రామీణార్థిక వ్యవస్థ గాడిన పడుతుందంటున్నారు. -
శక్తికి యుక్తిని జోడించి ముందుకు..
స్త్రీని దేవతగా పూజించే చోటే మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి. దేవతను చేశారంటే శక్తిని గ్రహించి కాదు.. త్యాగ మంత్రంతో శక్తిని సంగ్రహించి బలహీనపర్చారని అర్థం. ఈ మాట చెప్పడానికి పండగను మించిన సందర్భం ఉండదనిపించింది. పైగా దసరా నవరాత్రులు మొదలయ్యే నెల ముందు హథ్రాస్ దారుణాన్ని చవి చూసిందీ దేశం. దాదాపు రెండు వారాల కిందట విజయవాడలో దివ్య హత్యనూ జీర్ణం చేసుకుంది. ఈ రెండు తాజా ఉదాహరణలు చాలు కదా.. ఈ పుణ్యభూమిలో స్త్రీ దేవత అని చెప్పడానికి. మళ్లీ ఇలాంటి సమయాలే మహిళలూ మనుషులే .. వాళ్లకూ హక్కులుంటాయి.. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం.. కుల, పురుషాహంకారాన్ని నిలువరించే యుక్తి, సమాన స్థాయి కోసం పోరాడే శక్తీ ఉంటాయని నిరూపిస్తాయి. ఆ లక్షణాలను కదా గౌరవించాలి.. ఆరాధించాలి.. స్ఫూర్తిగా తీసుకోవాలి! కుల, మత, జెండర్ వారీగా ఏలికలు జనాలను విడగొట్టి బలహీనపరుస్తుంటే.. అదే కుల, మత, జెండర్లను ఒక్కటి చేసుకుంటూ బలమైన శక్తిగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు మహిళలు. ఒక్క స్త్రీ సమస్యల మీదే కాదు.. మొత్తం ప్రజల హక్కులను కాపాడేందుకు! ఆ యోధులందరినీ పేరుపేరునా పరిచయం చేయాలనే ఉంది. స్థల పరిమితులను దృష్టిలో పెట్టుకొని తాజా పరిణామాల్లో సాహసాన్ని ప్రదర్శించిన శక్తుల గురించే ఉదహరించాల్సి వస్తోంది. ఆ ప్రయాణం హథ్రాస్ నుంచే మొదలు పెడదాం.. పందొమ్మి దేళ్ల దళిత అమ్మాయిని ఆ ఊరి ఠాకూర్ల సంతానం కొన్ని రోజులుగా వెంటపడుతూ.. వేధించారు. ఆ అమ్మాయి కుటుంబీకులు ఈ విషయం మీద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదెవ్వరూ. చివరకు ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి.. ఆ నిజాన్ని బయటపెట్టకుండా నాలుక కోసి హింసించి చంపేశారు. ఈ ఠాకూర్ల కొడుకులను కడుపులో పెట్టుకునేందుకు పోలీసులు ఆ అమ్మాయి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారు.. తల్లిదండ్రులను రానివ్వకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టి మరీ. ఆ చితి మంటలను ప్రత్యక్షంగా రిపోర్ట్ చేసి ఆ దురాగతాన్ని దేశానికి చూపించిన శక్తి పేరు తనూశ్రీ పాండే. ఇండియా టుడే జర్నలిస్ట్. ఆ ఊరి గుట్టును రట్టుచేసిన వారికి భూమ్మీద నూకల్లేకుండా చేస్తారు అక్కడి పెద్దలు ప్రభుత్వ మద్దతుతో. ఆ క్రూరత్వానికి భయపడలేదు తనూశ్రీ. నేరాన్ని ఫోకస్ చేసింది. బెదిరింపులను ఎదుర్కొంది. అయినా మైక్ పట్టుకొని ఆ ఊరి నడిబొడ్డున నిలబడ్డది.. నిజాన్ని కెమెరాకు పట్టించింది. బారికేడ్లను తోసేసుకొని బాధితురాలి ఇంటికి వెళ్లింది. బాధితురాలి తల్లిని గట్టిగా గుండెకు హత్తుకుంది. ఆ స్పర్శకు ఆ అమ్మలో గూడుకట్టుకున్న దుఃఖం వరదైంది. దేశాన్ని ముంచెత్తింది. అది ప్రళయంగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన ఊర్లోని అగ్రవర్ణాలన్నీ ఒక్కటయ్యాయి నిందితుల పక్షాన. పోలీసులను ఊరి చుట్టూ కంచెలా మార్చారు మీడియాను రానివ్వకుండా. ఈ దుష్పరిణామాన్ని బయటపెట్టింది ఇంకో శక్తే. పేరు ప్రతిమ మిశ్రా. పోలీసులు తోస్తున్నా.. ఊళ్లో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నా.. లెక్కచేయలేదు. ఎత్తి వ్యాన్‌లో కూర్చోబెడ్తున్నా వెనక్కి మళ్లలేదు. తదనంతర పరిస్థితులను కళ్లకుకడ్తూనే ఉంది. బాధితులకు న్యాయ సహాయం చేయడానికి ఇంకో శక్తీ నిలబడ్డది. పేరు సీమ కుష్వాహా. నిర్భయ కేసులో బాధితుల తరపున వాదించిన లాయర్. ఇప్పుడు హథ్రాస్ సంఘటనలోనూ న్యాయ దేవత కళ్లగంతలు విప్పే సాహసం చేయబోతోంది. ఈ చైతన్యాన్ని ఇదివరకే అందిపుచ్చుకున్న ప్రాంతాలున్నాయి. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. దళితుల, స్త్రీల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేస్తున్నవాళ్లున్నారు. వృత్తి బాధ్యతల్లో బిజీగా ఉన్నా ఈ సామాజిక బాధ్యతనూ నిర్వర్తిస్తున్నారు. సుజాత సూరెపల్లి, దీప్తి, కవితా పులి, స్వాతి వడ్లమూడి, చైతన్య పింగళి, భరణి చిత్రలేఖ, రమా సుందరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శక్తుల జాబితా పెద్దదే. కుల, పురుష దురహంకారంతో సామాజిక మాధ్యమాల్లో ఆడవాళ్ల మీద నోరుపారేసుకొని, లేబుల్ వేసిన మగవాళ్లు అమెరికాలో ఉన్నా వదిలిపెట్టలేదు. కుల,పురుష దురహంకార దాడులకు, హత్యలను నిలదీస్తున్నారు. ఈ వైపరీత్యాలను నిలువరించడానికి మాటలు, రాతలు, బొమ్మలు, చేతలు.. ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్లు అనుసరిస్తున్నారు. స్త్రీ సమస్యల నుంచి రాజకీయ పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాల దాకా అన్నిటికీ తమ గళాన్ని వినిపిస్తున్నారు. కలాన్ని అందిస్తున్నారు. జనాన్ని కదిలిస్తున్నారు. సహాయానికి వస్తున్నారు. వీళ్లకూ బెదిరింపులు, హెచ్చరికలూ వెళుతున్నాయి. ‘పర్సోనా నాన్ గ్రాటా’ కేటగరీ పరిగణనలూ ఉంటున్నాయి. లెక్కచేయట్లేదు. సోషల్ నెట్వర్క్ అకౌంట్స్ క్లోజ్ చేసుకోవట్లేదు. ధర్నాలు, నిరసనలు మానుకోవట్లేదు. శక్తికి యుక్తిని జోడించి ముందుకు కదులుతూనే ఉన్నారు. స్ఫూర్తిని పంచుతునే ఉన్నారు. మహిళలను దేవతలుగా పూజించడం మాని తోటి పౌరులుగా గుర్తించి, గౌరవించే సంస్కృతి కావాలి. ఆ శుభ ఘడియ వచ్చేవరకు శక్తుల పోరాటం ఆగదు. ఆ స్ఫూర్తి నవ రాత్రులకే పరిమితం కాదు, 365 రోజులూ కొనసాగుతూనే ఉంటుంది. -
మహిళా సంఘాలకు రూ.902 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలకు రూ.902 కోట్ల వడ్డీ లేని రుణాల బకాయిలు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.339 కోట్ల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 1.74 లక్షల మహిళా సంఘాలకు బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా రూ.7,900 కోట్ల రుణాలు అందించామన్నారు. 2018–19లో 3.23 లక్షల మహిళా సంఘాలకు రూ.8,800 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని.. ఇప్పటికే దాదాపు రూ.2,000 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. పారిశుధ్య కార్మికులకు రూ.8,500 గతంలో లేని విధంగా దాదాపు రూ.1,200 కోట్లను బడ్జెట్లో పంచాయతీలకు కేటాయించామని మంత్రి జూపల్లి చెప్పారు. పంచాయతీల్లో తక్కువ వేతనాలతో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.8,500 చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు వెల్లడించారు. వేతనాన్ని నేరుగా కార్మికుని బ్యాంకు ఖాతాలోనే పంచాయతీలు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జోనల్ విధానంపై కేంద్రం నుంచి స్పష్టత రాగానే గ్రామ కార్యదర్శుల నియామకం పూర్తి చేస్తామన్నారు. 112, 212 జీవోల మేరకు 1994 కన్నా ముందు నుంచి పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను 90 శాతం క్రమబద్ధీకరించామని, ఎవరైనా మిగిలితే వారినీ క్రమబద్ధీకరిస్తామని జూపల్లి చెప్పారు. కేరళ వరద బాధితులకు నెల వేతనం ఇస్తున్నట్లు ప్రకటించారు. -
ఉజ్వల భవిష్యత్తుకు ‘ఎరువు’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్వావలంబన దిశగా మరో అడుగు ముందుకు వేశాయి. తాజాగా రైతులకు ఎరువులు అమ్మే వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత అందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 రైతు మహిళా సంఘాలు వివిధ జిల్లాల్లో ఎరువుల వ్యాపారం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఇవి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ (ఎఫ్‌పీజీ)లుగా ఏర్పడ్డాయి. ఇందులో 3 సంఘాలు ఎరువుల అమ్మకాన్ని ప్రారంభించాయి. మహిళా రైతులతోఎఫ్పీజీల ఏర్పాటు.. ఒక్కో గ్రామంలో భూములున్న మహిళా రైతులను ఒక్కో గ్రూప్‌లో 15 నుంచి 20 మంది వరకు ఎంపిక చేసి ఎఫ్‌పీజీని ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యురాలు సభ్యత్వం కింద రూ.500 గ్రామ స్థాయిలోని ఎఫ్‌పీజీ బాధ్యులకు చెల్లించాలి. ఇలా మండల స్థాయిలోని అన్ని ఎఫ్‌పీజీ గ్రూపులు కలిపి ఎరువుల వ్యాపారం చేసేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎరువుల వ్యాపారం నిర్వహించి ఇందులో వచ్చే లాభాలను గ్రూప్ సభ్యులందరికీ పంపిణీ చేస్తారు. అంతేకాకుండా ఈ గ్రూప్ సభ్యులు తమ కుటుంబ వ్యవసాయానికి కావాల్సిన ఎరువులను కూడా ఎఫ్‌పీజీ నిర్వహించే దుకాణం నుంచి తీసుకోవచ్చు. అన్ని గ్రూప్‌లనుంచి వచ్చిన సభ్యత్వ రుసుముతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇచ్చే ఆర్థిక సహకారంతో ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ నుంచి ఎరువుల సరఫరా.. రైతు మహిళా గ్రూపులు నిర్వహించే ఎరువుల దుకాణాలకు మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రారంభమైన మూడు దుకాణాలకు మార్క్‌ఫెడ్ ఒక్కో దుకాణానికి 20 టన్నుల యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేసింది. ఎరువులతోపాటు వరి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ, పెసర్ల విత్తనాలతోపాటు ఆయా ప్రాంతాల్లో రైతులకు ఏరకం విత్తనాలు అవసరమో వాటిని కూడా మార్క్‌ఫెడ్ నుంచి తెప్పించుకుంటామని ఈ దుకాణాల ఎఫ్‌పీజీలు పేర్కొంటున్నాయి. సహకార సంఘాలకు సరఫరా చేసినట్లుగానే ఈ దుకాణాలకు మార్క్‌ఫెడ్ రవాణా ఖర్చులు లేకుండా ఎరువులను అందజేస్తుంది. సెర్ప్ ఇచ్చే నిధులు, సభ్యుల వాటాధనంపై.. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేస్తారు. ఎరువుల అమ్మకం వ్యాపారంలోకి స్వయం సహాయక సంఘాలు ప్రవేశించడంతో..ఎరువుల కొరత ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు గ్రూపులు తొలి అడుగు రాష్ట్రంలో ఇలా ఏర్పడిన ఎనిమిది ఎఫ్‌పీజీలు ఎరువుల వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని సంతోష ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్‌లోని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలలో చివ్వెంల ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీల ఎఫ్‌పీజీలు ప్రస్తుతం ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకం ప్రారంభించాయి. ముందుగా ఈ గ్రూపు సభ్యుల వాటా ధనంతో ఎరువులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఒక్కో దుకాణానికి సెర్ప్ రూ.10 లక్షలు అందజేసింది. ఇక సిద్దిపేట జిల్లాలోని కొయిర్ (నేలతల్లి) ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, మెదక్ జిల్లాలో కోడిపల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో యాచారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీలు త్వరలో ఎరువుల వ్యాపారం ప్రారంభించనున్నాయి. రైతులకు అందుబాటులో ఎరువులు మండలంలోని రైతు మహిళా సంఘాల సభ్యుల వాటాధనంతో దుకాణం ప్రారంభించాం. సెర్ప్ నుంచి కూడా ఆర్థిక సాయం అందింది. రైతులకు ఎలాంటి ఎరువులు కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ఇక్కడే ఎరువులు తీసుకోవాలని సంఘంలోని సభ్యులకు చెప్పాం. ఇది ఒక రకంగా రైతులకు సేవ చేయడమే. – ధరావత్ పార్వతి, చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఎరువుల కొరత ఉండదు.. మా సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేశాం. దళారులు రైతులను ముంచకుండా మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లు చేసి వెంటనే డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు ఎరువులు అమ్ముతున్నాం. రైతులకు ఎరువులు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నయని చెప్పుకునేలా చేయడమే మా లక్ష్యం. ప్రస్తుతం కొద్ది మొత్తంలో ఎరువులు తెచ్చాం. రానున్న రోజుల్లో రైతులకు ఏ ఎరువులు కావాలో అన్నీ తెప్పిస్తాం. – వేములకొండ పద్మ, వైస్ చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ -
బియ్యం ఇంకా రాలే..
ఆదిలాబాద్ అర్బన్ : జూలై ఒకటో తారీఖు గడిచిపోయింది. ఫస్టు కాకముందే ప్రతి నెల బియ్యం కంట్రోల్ దుకాణానికి వస్తుండే. కానీ ఈ నెల రేషన్ బియ్యం ఇంకా రాలేదు. రేపెళ్లుండి వసాయేమో.. అని గ్రామాల్లో కొందరు కార్డుదారులు చర్చించుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రేషన్ డీలర్లు సమ్మెలో ఉండడం, పంపిణీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం.. వెరసి ఈ నెల కోటా బియ్యం రేషన్ దుకాణాలకు వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే వచ్చే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్ (మండలస్థాయి నిల్వ గిడ్డంగి)ల నుంచి ఇంకా గ్రామాలకు రేషన్ బియ్యం సరఫరా కాలేదు. డీడీలు కట్టిన డీలర్లకు ఒక్కో లోడ్ లారీ బియ్యం చొప్పున సరఫరా చేస్తున్న అధికారులు, డీడీలు కట్టని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నెల 29తో డీలర్ల డీడీల సమర్పణ గడువు ముగిసినా.. జూలై 1 ఆదివారం వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ గడువు సైతం ముగియడంతో మహిళా సంఘాల ద్వారా డీడీలు తీసి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. 112 చోట్ల డీలర్లు.. 243 చోట్ల సంఘాలు.. జిల్లాలో ఎప్పుడు జరగని వింత పరిస్థితి చోటు చేసుకుంటోంది. జిల్లాలో 355 చౌక ధరల దుకాణాల పరిధిలో 1,81,922 కార్డుదారులకు నెలకు 4,020 క్వింటాళ్ల బియ్యం పంపిణీ అవుతున్నాయి. ఈ నెల రేషన్ బియ్యాన్ని 112 చోట్ల డీలర్లు, 243 చోట్లలో మహిళా సంఘాలు గ్రామాలో, విలేజ్ ఆర్గనైజర్లు (వీవో) పట్టణాల్లో పంపిణీ చేయనున్నారు. అయితే డీలర్లు ఇదివరకు పంపిణీ చేసిన స్థలాల్లోనే పంపిణీ చేయనుండగా, సంఘాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని గ్రామ పంచాయతీ, కమ్యూనిటీ, యూత్ భవనాల్లో పంపిణీ చేయనున్నారు. ఇందుకు అధికారులు సంబంధిత భవనాల వివరాలు సేకరించి బియ్యాన్ని నిల్వ చేసేందుకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. బియ్యం పంపిణీకి గుర్తించిన మహిళా సంఘాలతో సోమవారం నుంచి డీడీలు కట్టించి అదే రోజు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. అయితే డీడీలు సంఘం డబ్బుల ద్వారా పంపిణీ చేయగా వచ్చిన డబ్బును తమకు జమ చేసుకోనున్నారు. సరిపడా డబ్బు సంఘాల వద్ద అందుబాటులో లేకుంటే క్రెడిట్ ఆర్వో (బియ్యం పంపిణీ చేశాకే డబ్బు చెల్లింపు చేయడం)తో బియ్యం సరఫరా చేయనున్నట్లు అధికారులు ఇది వరకే స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 10 వరకు బియ్యం పంపిణీ చేసి స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన చోట గడువును పొడిగించనున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరుకులు అందకపోయినా, సరఫరాలో ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1967కు లేదా వాట్సాప్ నంబర్ 7330774444కు సమాచారం ఇవ్వవచ్చని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. సంఘాలతో సాధ్యమేనా..? రేషన్ బియ్యాన్ని మహిళా ద్వారా పంపిణీ చేయడంపై డీలర్లు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం మహిళా సంఘాల వద్ద తూకం మిషన్లు లేవు. వాటిపై వారికి అవగాహన లేదు. పక్క జిల్లాలో ఇది వరకే మహిళా సంఘాలకు తూకం మిషన్ల వాడకంపై, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నా.. మన జిల్లాలో అధికారులు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే ఈ–పాస్ సమయంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత ఎలక్ట్రానిక్ తూకం మిషన్లు డీలర్ల వద్ద ఉన్నాయి. డీలర్లతో మాట్లాడి వారి వద్ద ఉన్న తూకం మిషన్లను మహిళా సంఘాలకు ఇప్పించే బాధ్యతను జిల్లా యంత్రాంగం తహసీల్దార్లకు అప్పగించింది. అయితే పంపిణీ గడువు దగ్గర పడుతున్నా ఇంత వరకు ఏ ఒక్క తహసీల్దార్ ఆ దిశగా అడుగు వేయలేదు. దీంతో మహిళా సంఘాల ద్వారా బియ్యం పంపిణీ సాధ్యమేనన్నా అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా కార్డుదారులకు బియ్యం సరఫరా కావడం ముఖ్యమని పలువురు చర్చించుకోవడం గమనార్హం. -
కదులుతున్న డొంక !
ఆర్మూర్: పట్టణంలో మహిళా సంఘాల నుంచి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగుల బలవంతపు వసూళ్ల కూపీ లాగితే జిల్లా కేంద్రంలోని పీడీ కార్యాలయం డొంక కదులుతోంది. నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక ఉద్యోగులను నియమించిన తీరు, వారిపై ముడుపుల ఆరోపణలు వచ్చినా స్పందించని ఉన్నతాధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు మహిళ సాధికారతకు పెద్ద పీట వేస్తూ పావళా వడ్డీ, వడ్డీ లేని బ్యాంకు రుణాలు అందిస్తుంటే మరో వైపు మెప్మాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులు తమ జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారు. మహిళా సంఘాల వారిని ముడుపుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారు. వక్రమార్గాలను ఎన్నుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం ఆర్మూర్‌లో మెప్మా పరిధిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో) నియామకం, మహిళా సంఘాల నుంచి సీవో చేపడుతున్న బలవంతపు వసూళ్లు. సదరు సీవో గతంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో విధులు నిర్వహించేవారు. మెప్మా పీడీగా మధుకర్ బాబు విధులు నిర్వహిస్తున్న సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు రుజువు కావడం తో సీవోను ఉద్యోగం నుంచి తొలగించారు. పలు వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను మెప్మా ఉన్నతాధికారులు ఆర్మూర్‌లో మళ్లీ సీవోగా నియమిస్తూ ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ వ్యవహారంలో లక్ష రూపాయలు చేతులు మారినట్లు ఆరోపలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సీవోగా చేరిన ఆమో విద్యార్హత సర్టిఫికెట్లలోనూ సైతం గందరగోళం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిక్కిం యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నతాధికారులను మేనేజ్ చేసి ఆర్మూర్‌లో రీఎంట్రీ ఇచ్చినట్లు జిల్లా కేంద్రంలోని పీడీ కార్యాలయంలో చెప్పుకుంటున్నారు. మరో వైపు పట్టణంలోని మహిళా సంఘాలతో మమేకమై వారికి బ్యాంకు రుణాలు ఇప్పించడంలో, స్వయం ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పించాల్సిన సమయంలో క్రియాశీల బాధ్యతలు నిర్వహించే సీవో పోస్టుకు స్థానికులను మాత్రమే నియమించాలనే నిబంధన సైతం ఉంది. ఇక్కడ ఆ నిబంధనలను తుంగలో తొక్కేసారు. సీవో పోస్టుకు అర్హులైన నిరుద్యోగులు ఆర్మూర్‌లో ఎందరో ఉన్నా వారందరినీ కాదని జిల్లా కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగిణిని ఆర్మూర్‌కు పంపించారు. ఇంతకముందు జిల్లా కేంద్రంలో కొనసాగిన తంతు ఇక్కడా కూడా అమలైంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు ఇప్పించే సమయంలో ఆర్పీలు డాక్యుమెంటేషన్ చేస్తే సీవో ఆ డాక్యుమెంట్ల ను పరిశీలించి బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పిం చాల్సి ఉంటుంది. అందుకు మెప్మా నుంచి సీవోకు వేతనం సైతం అందుతుంది. కాని ఇలా రుణాలు ఇప్పించిన సమయంలో మహిళా సంఘాల వారు సంతోషంగా ఆర్పీలకు, సీవోకు కొంత మొత్తాన్ని ఇస్తుంటారు. అంత వరకు సమస్య లేదు. కాని ఆ సీవో ఆర్మూర్‌కు వచ్చిన నాటి నుంచి ఆర్పీల సహకారంతో బలవంతపు వసూళ్లకు తెరలేపారు. ఈ బలవంతపు వసూళ్లకు ఆర్పీలు సైతం తోడు కావడంతో మహిళా సంఘాల వారిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. మహిళా సంఘాల వారు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన సమయంలో వారికి ప్రభుత్వాలు చెపుతున్న పావళా వడ్డీ, వడ్డీ లేని రుణాలను వర్తింపజేయాలంటే ఈ ఆర్పీలు, సీవోలే కంప్యూటర్ సహకారంతో ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. అలా పొందుపర్చిన సంఘాల వారికే వడ్డీ మాఫీ వర్తిస్తుంది. అప్పటి వరకు సంఘాల వారు చెల్లించిన వడ్డీని బ్యాంకర్లు తిరిగి మహిళా సంఘాల అకౌంట్లలో జమ చేస్తారు. దీనిని మెప్మా ఉద్యోగులు బెదిరింపులకు దిగడానికి అవకాశంగా మల్చుకున్నారు. సీవో, ఆర్పీలు అడిగిన ముడుపులు ఇవ్వకపోతే ఎక్కడ తమ సంఘం వడ్డీ మాఫీ అర్హతకు నోచుకోదో అనే భయంతో మహిళా సంఘాల సభ్యులు వా రు అడిగినంత మొత్తం చెల్లించారు. ఈ వ్యవహారం కాస్త ‘సాక్షి’ దినపత్రికలో వరస కథకాలు ప్రచురితం కావడంతో కొందరు ఆర్పీలు తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేశారు. సీవో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించకపోగా, నిబంధనలకు విరుద్ధంగా ఆర్మూర్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఉన్నతాధికారుల అండ లభిస్తోంది. దీంతో ఈ వసూళ్లలో ఎవరి వాటా ఎంతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ స్వయంగా కలగజేసుకొని పూర్తి స్థాయి విచారణ జరిపితే గాని మెప్మాలో జరుగుతున్న అక్రమాల బాగోతం వెలుగు చూసే అవకాశం లేదు.