సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలకు రూ.902 కోట్ల వడ్డీ లేని రుణాల బకాయిలు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.339 కోట్ల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 1.74 లక్షల మహిళా సంఘాలకు బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా రూ.7,900 కోట్ల రుణాలు అందించామన్నారు. 2018–19లో 3.23 లక్షల మహిళా సంఘాలకు రూ.8,800 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని.. ఇప్పటికే దాదాపు రూ.2,000 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు.
పారిశుధ్య కార్మికులకు రూ.8,500
గతంలో లేని విధంగా దాదాపు రూ.1,200 కోట్లను బడ్జెట్‌లో పంచాయతీలకు కేటాయించామని మంత్రి జూపల్లి చెప్పారు. పంచాయతీల్లో తక్కువ వేతనాలతో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.8,500 చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు వెల్లడించారు. వేతనాన్ని నేరుగా కార్మికుని బ్యాంకు ఖాతాలోనే పంచాయతీలు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
జోనల్ విధానంపై కేంద్రం నుంచి స్పష్టత రాగానే గ్రామ కార్యదర్శుల నియామకం పూర్తి చేస్తామన్నారు. 112, 212 జీవోల మేరకు 1994 కన్నా ముందు నుంచి పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను 90 శాతం క్రమబద్ధీకరించామని, ఎవరైనా మిగిలితే వారినీ క్రమబద్ధీకరిస్తామని జూపల్లి చెప్పారు. కేరళ వరద బాధితులకు నెల వేతనం ఇస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment