ఉజ్వల భవిష్యత్తుకు ‘ఎరువు’ | Women's societies into fertilizer business | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవిష్యత్తుకు ‘ఎరువు’

Published Tue, Jul 31 2018 1:08 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

Women's societies into fertilizer business - Sakshi

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్వావలంబన దిశగా మరో అడుగు ముందుకు వేశాయి. తాజాగా రైతులకు ఎరువులు అమ్మే వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) చేయూత అందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 రైతు మహిళా సంఘాలు వివిధ జిల్లాల్లో ఎరువుల వ్యాపారం చేసేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయి. ఇవి ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ గ్రూప్‌ (ఎఫ్‌పీజీ)లుగా ఏర్పడ్డాయి. ఇందులో 3 సంఘాలు ఎరువుల అమ్మకాన్ని ప్రారంభించాయి.  

మహిళా రైతులతోఎఫ్‌పీజీల ఏర్పాటు..
ఒక్కో గ్రామంలో భూములున్న మహిళా రైతులను ఒక్కో గ్రూప్‌లో 15 నుంచి 20 మంది వరకు ఎంపిక చేసి ఎఫ్‌పీజీని ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యురాలు సభ్యత్వం కింద రూ.500 గ్రామ స్థాయిలోని ఎఫ్‌పీజీ బాధ్యులకు చెల్లించాలి. ఇలా మండల స్థాయిలోని అన్ని ఎఫ్‌పీజీ గ్రూపులు కలిపి ఎరువుల వ్యాపారం చేసేందుకు చైర్మన్, వైస్‌ చైర్మన్, ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకున్నారు.

వీరి ఆధ్వర్యంలో ఎరువుల వ్యాపారం నిర్వహించి ఇందులో వచ్చే లాభాలను గ్రూప్‌ సభ్యులందరికీ పంపిణీ చేస్తారు. అంతేకాకుండా ఈ గ్రూప్‌ సభ్యులు తమ కుటుంబ వ్యవసాయానికి కావాల్సిన ఎరువులను కూడా ఎఫ్‌పీజీ నిర్వహించే దుకాణం నుంచి తీసుకోవచ్చు. అన్ని గ్రూప్‌లనుంచి వచ్చిన సభ్యత్వ రుసుముతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇచ్చే ఆర్థిక సహకారంతో ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు.  


మార్క్‌ఫెడ్‌ నుంచి ఎరువుల సరఫరా..
రైతు మహిళా గ్రూపులు నిర్వహించే ఎరువుల దుకాణాలకు మార్క్‌ఫెడ్‌ నుంచి ఎరువులు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రారంభమైన మూడు దుకాణాలకు మార్క్‌ఫెడ్‌ ఒక్కో దుకాణానికి 20 టన్నుల యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులను అందజేసింది. ఎరువులతోపాటు వరి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ, పెసర్ల విత్తనాలతోపాటు ఆయా ప్రాంతాల్లో రైతులకు ఏరకం విత్తనాలు అవసరమో వాటిని కూడా మార్క్‌ఫెడ్‌ నుంచి తెప్పించుకుంటామని ఈ దుకాణాల ఎఫ్‌పీజీలు పేర్కొంటున్నాయి.

సహకార సంఘాలకు సరఫరా చేసినట్లుగానే ఈ దుకాణాలకు మార్క్‌ఫెడ్‌ రవాణా ఖర్చులు లేకుండా ఎరువులను అందజేస్తుంది. సెర్ప్‌ ఇచ్చే నిధులు, సభ్యుల వాటాధనంపై.. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ చేస్తారు. ఎరువుల అమ్మకం వ్యాపారంలోకి స్వయం సహాయక సంఘాలు ప్రవేశించడంతో..ఎరువుల కొరత ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  


మూడు గ్రూపులు తొలి అడుగు
రాష్ట్రంలో ఇలా ఏర్పడిన ఎనిమిది ఎఫ్‌పీజీలు ఎరువుల వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని సంతోష ఉమెన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ, ఆదిలాబాద్‌ జిల్లాలో గుడిహత్నూర్‌లోని ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలలో చివ్వెంల ఉమెన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీల ఎఫ్‌పీజీలు ప్రస్తుతం ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకం ప్రారంభించాయి.

ముందుగా ఈ గ్రూపు సభ్యుల వాటా ధనంతో ఎరువులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఒక్కో దుకాణానికి సెర్ప్‌ రూ.10 లక్షలు అందజేసింది. ఇక సిద్దిపేట జిల్లాలోని కొయిర్‌ (నేలతల్లి) ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ, మెదక్‌ జిల్లాలో కోడిపల్లి ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ, కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ, ఆసిఫాబాద్‌ జిల్లాలో రెబ్బన ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో యాచారం ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీలు త్వరలో ఎరువుల వ్యాపారం ప్రారంభించనున్నాయి.  

రైతులకు అందుబాటులో ఎరువులు
మండలంలోని రైతు మహిళా సంఘాల సభ్యుల వాటాధనంతో దుకాణం ప్రారంభించాం. సెర్ప్‌ నుంచి కూడా ఆర్థిక సాయం అందింది. రైతులకు ఎలాంటి ఎరువులు కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ఇక్కడే ఎరువులు తీసుకోవాలని సంఘంలోని సభ్యులకు చెప్పాం. ఇది ఒక రకంగా రైతులకు సేవ చేయడమే. – ధరావత్‌ పార్వతి, చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ

ఎరువుల కొరత ఉండదు..
మా సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేశాం. దళారులు రైతులను ముంచకుండా మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లు చేసి వెంటనే డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు ఎరువులు అమ్ముతున్నాం. రైతులకు ఎరువులు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నయని చెప్పుకునేలా చేయడమే మా లక్ష్యం. ప్రస్తుతం కొద్ది మొత్తంలో ఎరువులు తెచ్చాం. రానున్న రోజుల్లో రైతులకు ఏ ఎరువులు కావాలో అన్నీ తెప్పిస్తాం.   – వేములకొండ పద్మ, వైస్‌ చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement