serf
-
‘వెలుగు’ పేరుతో గోల్మాల్
సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు సంఘమిత్ర కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచింది. రుణాల మంజూరుకు చేతివాటం మొదలు వీఏఓ నిధుల స్వాహా వరకు కుంభకోణాలమయంగా మారింది. ప్రస్తుతానికి పోతిరెడ్డిపాళెం వీఏఓ రూ.6.2 లక్షల నిధుల దుర్వినియోగమయ్యాయని తేలింది. దీనిపై ఏపీఎం సుజాత, సీసీ మమతపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.కోవూరు సంఘమిత్ర కార్యాలయ పరిధిలో మొత్తం 1250 గ్రూపులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఓ ఏపీఎం, నలుగురు సీసీలు, 25 మంది వీఓఏలుంటారు. వీరి పరిధిలో గ్రూపులకు రుణాల మంజూరు కార్యక్రమం జరుగుతుంది. అయితే రుణాలకు సంబంధించి సంఘమిత్ర ఉద్యోగులకు ముడుపులిస్తేనే పనులు జరుగుతాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోతిరెడ్డిపాళెం లీడర్ ఫిర్యాదుతో వెలుగులోకి.. కోవూరు మండలం పోతిరెడ్డిపాళేనికి చెందిన ఒకటో నంబర్ సంఘబంధ నాయకురాలు కాకి రాజమ్మ జనవరి 23న తమ పరిధిలోని సంఘబంధంలో జమైన సబ్‌ప్లాన్ నిధుల విత్‌డ్రా, సంఘ సభ్యుల నుంచి వసూలు చేసిన సబ్‌ప్లాన్, స్త్రీ నిధి రికవరీ నిధులు జమచేయలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్త్రీనిధి, డీఆర్డీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమణారెడ్డి ఫిబ్రవరి 18న ప్రాథమిక విచారణ జరిపి నివేదికను సమర్పించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకోవాలని యత్నించగా, టీడీపీ నేతలు, అప్పటి మంత్రుల సిఫార్సులతో ఆగాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వారిపై ఒత్తిళ్లు పెరిగాయి. అనంతరం ఎన్నికలు రావడంతో జాప్యం తలెత్తింది. సంఘబంధం సభ్యుల నుంచి రూ.6,20,216 మేర నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఫిబ్రవరిలో విచారణ అనంతరం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.1,54,000 చెల్లించినట్లు తేల్చారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం పోతిరెడ్డిపాళెంలో నిధుల దుర్వినియోగంపై పలుమార్లు ఫిర్యాదు వచ్చినా ఏసీ కామాక్షి, ఏపీఎం సుజాత, సీసీ మమత పట్టించుకోలేదని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. దుర్వినియోగమైన రూ.6,20,261 నిధులపై ఏసీ కామాక్షి, ఏపీఎం సుజాత, సీసీ మమత, వీఓఏ అనూరాధ బాధ్యత వహించాలని తెలిపారు. నిధులు దుర్వినియోగమైనందుకు, పర్యవేక్షణ లోపానికి సెర్ప్ నిబంధనల మేరకు 2009 సెక్షన్ ఏడు ప్రకారం ఏపీఎం సుజాత, సీసీ మమతను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాల వరకు పెళ్లికానుక ఏపీఎంగా పనిచేస్తున్న శేషారెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఉజ్వల భవిష్యత్తుకు ‘ఎరువు’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్వావలంబన దిశగా మరో అడుగు ముందుకు వేశాయి. తాజాగా రైతులకు ఎరువులు అమ్మే వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత అందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 రైతు మహిళా సంఘాలు వివిధ జిల్లాల్లో ఎరువుల వ్యాపారం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఇవి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ (ఎఫ్‌పీజీ)లుగా ఏర్పడ్డాయి. ఇందులో 3 సంఘాలు ఎరువుల అమ్మకాన్ని ప్రారంభించాయి. మహిళా రైతులతోఎఫ్పీజీల ఏర్పాటు.. ఒక్కో గ్రామంలో భూములున్న మహిళా రైతులను ఒక్కో గ్రూప్‌లో 15 నుంచి 20 మంది వరకు ఎంపిక చేసి ఎఫ్‌పీజీని ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యురాలు సభ్యత్వం కింద రూ.500 గ్రామ స్థాయిలోని ఎఫ్‌పీజీ బాధ్యులకు చెల్లించాలి. ఇలా మండల స్థాయిలోని అన్ని ఎఫ్‌పీజీ గ్రూపులు కలిపి ఎరువుల వ్యాపారం చేసేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎరువుల వ్యాపారం నిర్వహించి ఇందులో వచ్చే లాభాలను గ్రూప్ సభ్యులందరికీ పంపిణీ చేస్తారు. అంతేకాకుండా ఈ గ్రూప్ సభ్యులు తమ కుటుంబ వ్యవసాయానికి కావాల్సిన ఎరువులను కూడా ఎఫ్‌పీజీ నిర్వహించే దుకాణం నుంచి తీసుకోవచ్చు. అన్ని గ్రూప్‌లనుంచి వచ్చిన సభ్యత్వ రుసుముతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇచ్చే ఆర్థిక సహకారంతో ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ నుంచి ఎరువుల సరఫరా.. రైతు మహిళా గ్రూపులు నిర్వహించే ఎరువుల దుకాణాలకు మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రారంభమైన మూడు దుకాణాలకు మార్క్‌ఫెడ్ ఒక్కో దుకాణానికి 20 టన్నుల యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేసింది. ఎరువులతోపాటు వరి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ, పెసర్ల విత్తనాలతోపాటు ఆయా ప్రాంతాల్లో రైతులకు ఏరకం విత్తనాలు అవసరమో వాటిని కూడా మార్క్‌ఫెడ్ నుంచి తెప్పించుకుంటామని ఈ దుకాణాల ఎఫ్‌పీజీలు పేర్కొంటున్నాయి. సహకార సంఘాలకు సరఫరా చేసినట్లుగానే ఈ దుకాణాలకు మార్క్‌ఫెడ్ రవాణా ఖర్చులు లేకుండా ఎరువులను అందజేస్తుంది. సెర్ప్ ఇచ్చే నిధులు, సభ్యుల వాటాధనంపై.. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేస్తారు. ఎరువుల అమ్మకం వ్యాపారంలోకి స్వయం సహాయక సంఘాలు ప్రవేశించడంతో..ఎరువుల కొరత ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు గ్రూపులు తొలి అడుగు రాష్ట్రంలో ఇలా ఏర్పడిన ఎనిమిది ఎఫ్‌పీజీలు ఎరువుల వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని సంతోష ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్‌లోని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలలో చివ్వెంల ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీల ఎఫ్‌పీజీలు ప్రస్తుతం ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకం ప్రారంభించాయి. ముందుగా ఈ గ్రూపు సభ్యుల వాటా ధనంతో ఎరువులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఒక్కో దుకాణానికి సెర్ప్ రూ.10 లక్షలు అందజేసింది. ఇక సిద్దిపేట జిల్లాలోని కొయిర్ (నేలతల్లి) ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, మెదక్ జిల్లాలో కోడిపల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో యాచారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీలు త్వరలో ఎరువుల వ్యాపారం ప్రారంభించనున్నాయి. రైతులకు అందుబాటులో ఎరువులు మండలంలోని రైతు మహిళా సంఘాల సభ్యుల వాటాధనంతో దుకాణం ప్రారంభించాం. సెర్ప్ నుంచి కూడా ఆర్థిక సాయం అందింది. రైతులకు ఎలాంటి ఎరువులు కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ఇక్కడే ఎరువులు తీసుకోవాలని సంఘంలోని సభ్యులకు చెప్పాం. ఇది ఒక రకంగా రైతులకు సేవ చేయడమే. – ధరావత్ పార్వతి, చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఎరువుల కొరత ఉండదు.. మా సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేశాం. దళారులు రైతులను ముంచకుండా మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లు చేసి వెంటనే డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు ఎరువులు అమ్ముతున్నాం. రైతులకు ఎరువులు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నయని చెప్పుకునేలా చేయడమే మా లక్ష్యం. ప్రస్తుతం కొద్ది మొత్తంలో ఎరువులు తెచ్చాం. రానున్న రోజుల్లో రైతులకు ఏ ఎరువులు కావాలో అన్నీ తెప్పిస్తాం. – వేములకొండ పద్మ, వైస్ చైర్మన్, చివ్వెంల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ -
‘కుటుంబ సంక్షేమం’ అరకొర!
రెండేళ్లుగా ఎన్ఎఫ్బీఎస్ నిధులను తగ్గిస్తున్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: జాతీయ కుటుంబ సంక్షేమ పథకం(ఎన్ఎఫ్బీఎస్) నిధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా కోత పెడుతున్నాయి. సంపాదనాపరుడు మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయమందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకానికి కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్ అంచనాలకు, విడుదలవుతున్న నిధులకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఎన్‌ఎఫ్‌బీఎస్‌కి కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిధులను తగ్గిస్తుండడంతో బాధిత కుటుంబాలకు అందించే ఆర్థికసాయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోతపెడుతోంది. దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించాల్సి ఉండగా, దానిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు తగ్గించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.4 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన కేంద్రం రూ.1.33 కోట్లను మాత్రమే విడుదల చేసింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.8.02 కోట్లు కేటాయించగా రూ.4.12 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఐదు నెలలైనా చిల్లిగవ్వ రాలేదు 2016–17 సంవత్సరానికి రూ.16 కోట్ల బడ్జెట్ ఇస్తామని పేర్కొన్న కేంద్రం 5 నెలలైనా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో బాధిత కుటుంబాలకు ఎదురుచూపులు తప్పడంలేదు. కేంద్రం నుంచి సరిపడా నిధులు రాకపోవడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని ఎన్ఎఫ్బీఎస్ అమలు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వాపోతున్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సినమొత్తాన్ని తగ్గించడం ఎంతవరకు సబబని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు రూ.20 వేలు చెల్లించేందుకు తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ సెర్ప్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. -
ఏం రాయమంటారు సార్!
చిరుద్యోగి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అధికారంలో ఉన్న పెద్దల మనస్సు తెలుసుకొని అందుకనుగుణంగా ప్రవర్తిస్తారన్నది నానుడి. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం అడిగిన ఒక నివేదిక ఇవ్వడానికి ఇప్పుడు ఒక ప్రభుత్వ శాఖే మల్లగుల్లాలు పడుతోంది. దీని కథ కమామీషు ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక అమ్మకాల విధానాన్ని మార్చడానికి సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కార్ పెద్దలు.. ఏడాది క్రితం ఈ ప్రభుత్వమే తీసుకొచ్చిన కొత్త విధానాన్ని ఎందుకు అర్థాంతరంగా మార్చాల్సి వచ్చిందో చెప్పడానికి ప్రజల ముందు ఒక శ్వేతపత్రం పెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. నివేదిక తయారు చేయమని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులను ఆదేశించారు. తీరా ప్రభుత్వం అడిగిన నివేదిక తయారు చేసి పంపితే అక్కడి పెద్దలకు ఎంతకీ నచ్చడం లేదట. అన్ని సందర్భాలలో మాదిరిగా ఇసుక అమ్మకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని నివేదిక ఇస్తే.. అలాంటప్పుడు విధానం మార్చాల్సిన అవసరం ఏముందంటే... ప్రజలకు ఏం జవాబు చెబుతామని దానిని తిరస్కరించారట. కాదంటే, ఇసుక దోపిడీలో ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల జోక్యాన్ని నివేదికలో రాయమంటారా అని అమాయకంగానైనా అధికారులు ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావిస్తే, అలా ఎలా నివేదిక ఇస్తారంటూ అగ్గిమీద గుగ్గిలమే అయ్యారట. దీంతో ఏమి చేయాలో తోచక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు.