సుజాత( ఏపీఎం), మమత (సీసీ)
సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు సంఘమిత్ర కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచింది. రుణాల మంజూరుకు చేతివాటం మొదలు వీఏఓ నిధుల స్వాహా వరకు కుంభకోణాలమయంగా మారింది. ప్రస్తుతానికి పోతిరెడ్డిపాళెం వీఏఓ రూ.6.2 లక్షల నిధుల దుర్వినియోగమయ్యాయని తేలింది. దీనిపై ఏపీఎం సుజాత, సీసీ మమతపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.కోవూరు సంఘమిత్ర కార్యాలయ పరిధిలో మొత్తం 1250 గ్రూపులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఓ ఏపీఎం, నలుగురు సీసీలు, 25 మంది వీఓఏలుంటారు. వీరి పరిధిలో గ్రూపులకు రుణాల మంజూరు కార్యక్రమం జరుగుతుంది. అయితే రుణాలకు సంబంధించి సంఘమిత్ర ఉద్యోగులకు ముడుపులిస్తేనే పనులు జరుగుతాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పోతిరెడ్డిపాళెం లీడర్ ఫిర్యాదుతో వెలుగులోకి..
కోవూరు మండలం పోతిరెడ్డిపాళేనికి చెందిన ఒకటో నంబర్ సంఘబంధ నాయకురాలు కాకి రాజమ్మ జనవరి 23న తమ పరిధిలోని సంఘబంధంలో జమైన సబ్‌ప్లాన్ నిధుల విత్‌డ్రా, సంఘ సభ్యుల నుంచి వసూలు చేసిన సబ్‌ప్లాన్, స్త్రీ నిధి రికవరీ నిధులు జమచేయలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్త్రీనిధి, డీఆర్డీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమణారెడ్డి ఫిబ్రవరి 18న ప్రాథమిక విచారణ జరిపి నివేదికను సమర్పించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకోవాలని యత్నించగా, టీడీపీ నేతలు, అప్పటి మంత్రుల సిఫార్సులతో ఆగాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వారిపై ఒత్తిళ్లు పెరిగాయి. అనంతరం ఎన్నికలు రావడంతో జాప్యం తలెత్తింది. సంఘబంధం సభ్యుల నుంచి రూ.6,20,216 మేర నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఫిబ్రవరిలో విచారణ అనంతరం ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రూ.1,54,000 చెల్లించినట్లు తేల్చారు.
ఫిర్యాదులపై నిర్లక్ష్యం
పోతిరెడ్డిపాళెంలో నిధుల దుర్వినియోగంపై పలుమార్లు ఫిర్యాదు వచ్చినా ఏసీ కామాక్షి, ఏపీఎం సుజాత, సీసీ మమత పట్టించుకోలేదని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. దుర్వినియోగమైన రూ.6,20,261 నిధులపై ఏసీ కామాక్షి, ఏపీఎం సుజాత, సీసీ మమత, వీఓఏ అనూరాధ బాధ్యత వహించాలని తెలిపారు. నిధులు దుర్వినియోగమైనందుకు, పర్యవేక్షణ లోపానికి సెర్ప్ నిబంధనల మేరకు 2009 సెక్షన్ ఏడు ప్రకారం ఏపీఎం సుజాత, సీసీ మమతను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాల వరకు పెళ్లికానుక ఏపీఎంగా పనిచేస్తున్న శేషారెడ్డిని ఇన్‌చార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment