ఏం రాయమంటారు సార్!
ఏం రాయమంటారు సార్!
Published Sun, Nov 22 2015 4:13 AM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM
చిరుద్యోగి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అధికారంలో ఉన్న పెద్దల మనస్సు తెలుసుకొని అందుకనుగుణంగా ప్రవర్తిస్తారన్నది నానుడి. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం అడిగిన ఒక నివేదిక ఇవ్వడానికి ఇప్పుడు ఒక ప్రభుత్వ శాఖే మల్లగుల్లాలు పడుతోంది. దీని కథ కమామీషు ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక అమ్మకాల విధానాన్ని మార్చడానికి సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కార్ పెద్దలు.. ఏడాది క్రితం ఈ ప్రభుత్వమే తీసుకొచ్చిన కొత్త విధానాన్ని ఎందుకు అర్థాంతరంగా మార్చాల్సి వచ్చిందో చెప్పడానికి ప్రజల ముందు ఒక శ్వేతపత్రం పెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది.
నివేదిక తయారు చేయమని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులను ఆదేశించారు. తీరా ప్రభుత్వం అడిగిన నివేదిక తయారు చేసి పంపితే అక్కడి పెద్దలకు ఎంతకీ నచ్చడం లేదట. అన్ని సందర్భాలలో మాదిరిగా ఇసుక అమ్మకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని నివేదిక ఇస్తే.. అలాంటప్పుడు విధానం మార్చాల్సిన అవసరం ఏముందంటే... ప్రజలకు ఏం జవాబు చెబుతామని దానిని తిరస్కరించారట. కాదంటే, ఇసుక దోపిడీలో ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల జోక్యాన్ని నివేదికలో రాయమంటారా అని అమాయకంగానైనా అధికారులు ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావిస్తే, అలా ఎలా నివేదిక ఇస్తారంటూ అగ్గిమీద గుగ్గిలమే అయ్యారట. దీంతో ఏమి చేయాలో తోచక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు.
Advertisement
Advertisement